క్రీడలకు పాకిన యుద్ధం ప్రభావం!
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడులను నిరసిస్తూ రష్యాలో నిర్వహించాల్సిన ఫార్మూలావన్ రేసును రద్దు చేశారు. మాస్కో వేదికగా ఈ రేసు జరగాల్సి ఉంది. అయితే రష్యా నిరంకుశ వైఖరికి నిరసనగా ఫార్మూలావన్ అక్కడ జరగాల్సిన ఫార్మూలావన్ రేసులను నిర్వాహకులు రద్దు చేశారు. దీంతో పాటు ఫార్మూలావన్ స్పాన్సర్‌షిప్ నుంచి కూడా రష్యాను తొలగించారు. రష్యాలో జరిగే ఫార్మూలావన్ రేసులో పాల్గొనే ప్రసక్తే లేదని దిగ్గజ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ ప్రకటించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రష్యా గ్రాండ్‌ప్రిలో పాల్గొననని స్పష్టం చేశాడు.
మరోవైపు ఉక్రెయిన్‌పై దాడులకు నిరసనగా రష్యాలో జరిగే పలు క్రీడలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ రద్దు చేసింది. సమస్యకు పరిష్కారం లభించే వరకు రష్యా వేదికగా ఎలాంటి క్రీడలు నిర్వహించబోమని ఒలింపిక్ కమిటీ తేల్చి చెప్పింది. ఇక రష్యాను తమ దేశాల్లో జరిగే క్రీడల్లో పాల్గొనేందుకు రష్యాకు అనుమతి ఇవ్వబోమని యూరప్‌కు చెందిన పలు దేశాలు ప్రకటించాయి. రష్యా క్రీడాకారులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ఒలింపిక్ సంఘాలు స్పష్టం చేశాయి. మరోవైపు రష్యాఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం క్రీడలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రష్యాపై ప్రపంచ వ్యాప్తంగా పలువురు స్టార్ క్రీడాకారులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రపంచం శాంతిని కోరుకుంటుంటే రష్యా ఓ దేశంపై దాడులకు దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు.