మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌తో పాటు పాటు ఎఈఈ, డిఎఒ పరీక్షలను రద్దు చే సింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ ఏడాది జూ న్ 11న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రశ్నాపత్రాల లీకేజీల దృష్ట్యా కమిషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎఇ, టిపిబిఒ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్1 ప్రిలిమ్స్‌ను గతేడాది అక్టోబర్ 16న నిర్వహించగా, ఎఇఇ పరీక్షను ఈ ఏడాది జనవరి 22న, డిఎఒ పరీక్షను ఫిబ్రవరి 26న నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కమిటీ సమావేశమై ప్రస్తుత పరిణామాలపై చర్చించింది. సిట్ నివేదిక, అంతర్గత విచారణను పరిగణనలోకి తీసుకున్న తర్వాత గ్రూప్-1, ఎఇఇ, డిఎఒ పరీక్షలను రద్ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో పబ్లి క్ సర్వీస్ కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రూప్1కు 3,80,202 దరఖాస్తులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత మొత్తం 503 గ్రూప్1 పోస్టుల భర్తీకి విడుదల చేసిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. మొత్తం 19 విభాగాలకు చెందిన 503 పోస్టులకు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2.86 లక్షల మంది రాశారు. ఆ తర్వాత గ్రూప్1 మెయిన్స్ పరీక్ష తేదీలను సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖ రారు చేసింది. ఈ ఏడాది జూన్ 5 నుంచి 12వరకు మెయిన్స్ నిర్వహించనున్నట్టు గతంలో ప్రకటించింది. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారి లో 25,050 మంది మెయిన్‌కు అర్హత సాధించా రు. పేపర్ లీకేజీ వ్యవహారం కలకలం రేపడంతో పరిస్థితి అంతా ఒక్కసారిగా మారిపోయింది. రద్దు చేసిన ఈ గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహించాలని నిర్ణయించినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్ ఇంజినీర్ (ఎఇ) పేపర్ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక ఆధారంగానే ఈ పరీక్షలను సైతం రద్దు చేయాలని నిర్ణయించినట్టు కమిషన్ తెలిపింది.
* జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వాయిదా : 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. జులైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కారణంగా ఈ పరీక్షను వాయిదా వేశారు.
* ఎఇ పరీక్షలకు 833 అభ్యర్థులు : 833 ఎఇ పోస్టులకు 50వేల మంది దరఖాస్తు చేస్తుకున్నారు. మార్చి 5న జరిగిన ఈ పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే పేపర్ లీక్ అయిందనే అనుమానంతో ఎఇ పరీక్షను రద్దు చేశారు.
* టౌన్ ప్లానింగ్ దరఖాస్తుదారులకు నిరాశ : టౌన్ ప్లానింగ్ దరఖాస్తుదారులకు నిరాశే మిగిలింది. ఈ పరీక్షల కోసం గతేడాది అక్టోబర్‌లో దరఖాస్తులు స్వీకరించారు.175 పోస్టుల భర్తీకి 55 వేలమంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్ష తేదీని ప్రకటించే లోపే పేపర్ లీక్ అయి, టౌన్ ప్లానింగ్ పరీక్షను రద్దు చేశారు.
* ఎంవిఐ పరీక్షలు వాయిదా : ఎంవిఐ పరీక్షకు దరఖాస్తులను జనవరి 12న నుంచి స్వీకరించారు. ఈ జాబ్ లో 113 ఖాళీలు ఉన్నాయి. పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షను కూడా రద్దు చేశారు.