హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మరో బోర్డును రద్దు చేసింది. ఇప్పటికే హ్యాండ్‌లూమ్ బోర్డును రద్దు చేసిన కేంద్ర జౌళిశాఖ తాజాగా కాటన్ – జూట్ సలహా మండళ్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా చెన్నైతో పాటు హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఈ బోర్డులకు మంగళం పాడుతున్నట్ల్లు వెల్లడించింది. రద్దు చేసిన రెండు సలహా బోర్డులను తీసుకెళ్లి కోలకత్తాలో ఉన్న జనపనార బోర్డు ప్రధాన కార్యాలయంలో వి లీనం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తున్నట్లుగా స్పష్టం చేసింది. ప్ర భుత్వ రంగ సంస్థలను హేతుబద్ధీకరించడంలో భాగంగా ఈ బోర్డులను రద్దుచేసినట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. తక్కువ యంత్రాంగం- పాలన అన్న విధానంలో భాగంగా అన్ని ప్రభుత్వ వ్యవస్థలను క్రమపద్ధతిలో హేతుబద్ధీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
జనపనార రంగం అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన ఈ బోర్డులను కేంద్రం ఎత్తివేయడం వల్ల ఈ రంగంపై ఆధారపడ్డ వృత్తిదారులకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. వ్యాప్తంగా జనపనార రంగాన్ని అభివృద్ధి చేయాలన్న లక్షంతో జ్యూట్ బోర్డ్ యాక్ట్.. 2008 ప్రకారం నేషనల్ జ్యూట్ బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. దీనిని కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ రూపొందించింది. వ్యవస్థీకృత,వికేంద్రీకృత రంగం రెండింటినీ పోటీ పడాలన్న లక్షంతో అప్పటి కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా జనపనారతో కొత్త, వినూత్న వినియోగాన్ని అన్వేషించడానికి సంబంధిత కార్మికులకు బోర్డు పెద్దఎత్తున సహాయకారిగా నిలువనుంది. ప్రధానంగా కొత్త సాంకేతికతలను వ్యాప్తి చేయడం, యంత్రాల సహాయం, శిక్షణ, డిజైన్ ఇన్‌పుట్‌ల ద్వారా మానవ వనరుల అభివృద్ధి, పాండిత్య ప్రోత్సాహకాలను విస్తరించడానికి జనపనార సలహా బోర్డులు తగు సూచనలు, సలహాలు, శిక్షణను ఇస్తుంటాయి. ఈ సలహా బోర్డుల వల్ల జనపనార వృత్తిపై ఆదారపడ్డ వారికి ఎప్పటికప్పుడు చేయూతనిస్తుంటాయి.
అయితే కేంద్రం ఉన్నఫలంగా చైన్నైతో పాటు రాష్ట్రంలోని జనపనార సలహా బోర్డులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ రంగంపై ఆదారపడ్డ వారికి అశనిపాతంగా మారడం తథ్యమని తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జనపనార కార్మికులు బోర్డు నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు తీసుకోవాలన్న కోల్‌కత్త వరకు వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జనపనార కార్మికులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వంపై భగభగ మండిపడుతున్నారు. బోర్డులను రద్దు చేసే నిర్ణయాన్ని కేంద్రం మరోసారి పునసమీంచుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు. లేనిపక్షంలో రోడ్డుపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.