Wednesday, January 22, 2025

మాస్టర్‌ప్లాన్ల నిలిపివేత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్‌లను రద్దు చేస్తూ ఆయా పట్టణాల కౌన్సిళ్లు తీర్మానం చేశాయి. వీటి రద్దు కోసం కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కార్యవర్గాలు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించడంతో పాటు మాస్టర్‌ప్లాన్ ముసాయిదా తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్టు నిర్ణయించాయి. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై 60 రోజుల్లో 2,396, జగిత్యాల మాస్టర్‌ప్లాన్ వె య్యికిపైగా అభ్యంతరాలు రావడంతో వీటిని ర ద్దు చేసి కొత్తగా మాస్టర్‌ప్లాన్‌లను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను నిలిపివేశాం: అరవింద్ కుమార్

ప్రస్తుతం ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, నిరసనల మేరకు మాస్టర్ ప్లాన్‌ల ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌లతో మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల గురించి చర్చించారు. కామారెడ్డి పట్టణంలో విలీనమైన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అందరి సమన్వయంతో కొత్తగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని అరవింద్ కుమార్ పేర్కొన్నారు. రైతుల భూమి సేకరణ చేసే ఉద్దేశం తమకు లేదని ఆయన తెలిపారు. రైతుల భూములు ఎక్కడికి పోవని ఆయన సూచించారు. వ్యవసాయ భూముల్లో కొత్త రోడ్ల నిర్మాణం రైతులకు నష్టం జరగకుండా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను నిలిపివేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ రద్దు: కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్

మున్సిపల్ కార్యవర్గం అత్యవసర సమావేశంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్‌ను రద్దు చేస్తూ కౌన్సిలర్లు తీర్మానాన్ని ఆమోదించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ప్రత్యేకంగా సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ముసాయిదా తాము రూపొందించింది కాదని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నవి తెలిపారు. ఉన్నతాధికారులకు ఈ తీర్మానం పంపుతామని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపిందన్నారు. ఉన్నతాధికారులకు తీర్మానం పంపుతామని, కన్సల్టెన్సీపై చర్యల కోసం ఫిర్యాదు చేస్తామని రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని- ఆమె పేర్కొన్నారు.

రైతుల ముసుగులో అందోళన చేసేది రాజకీయ నాయకులే: జగిత్యాల ఎంఎల్‌ఎ

జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుపై ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో మాస్టర్ ప్లాన్‌ను అడ్డం పెట్టుకొని బిజెపి, కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకున్నారని ఆయన మండిపడ్డారు. సీనియర్ నాయకులుగా ఉన్న జీవన్ రెడ్డి హయంలో జగిత్యాల పట్టణం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. 1996లో కాంగ్రెస్ హయంలో తయారు చేసిన మాస్టర్ ప్లాన్ తప్పుల తడఖాగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మాస్టర్ ప్లాన్ విషయంలో చర్చించాడనికి ఆహ్వానిస్తే జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడతానని ఆయన వ్యాఖ్యానించారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా జీవన్ రెడ్డికి ఎందుకు అర్థం కాలేదో తెలియదన్నారు. జీవన్ రెడ్డి ఇకనైనా రైతులను రెచ్చగొట్టవద్దని ఆయన సూచించారు. రైతుల ముసుగులో అందోళన చేసేది రాజకీయ నాయకులే అని ఎంఎల్‌ఎ సంచలన వాఖ్యలు చేశారు. శుక్రవారం మాస్టర్‌ప్లాన్ రద్దుకు జగిత్యాల మున్సిపల్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించగా దీనిని రద్దు చేస్తూ ఈ కౌన్సిల్ తీర్మానించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News