మరికొన్ని దారి మళ్లీంపు
దక్షిణమధ్య రైల్వే అధికారులు
హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతోదక్షిణమధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రద్దు చేశారు. ఇందులో కొన్నింటిని దారి మళ్లీంచగా, మరికొన్ని రైళ్ల మార్గాలను కుదించారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం గులాబ్ తుఫాను కొనసాగుతోంది. ఒడిశాలోని గోపాలపూర్‌కు 310 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, సాయంత్రానికి కళింగపట్నం – గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఆదివారం విశాఖ, విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ, విజయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేశారు. ఆదివారం పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్, అంగూల్, సంబల్‌పూర్ మీదుగా దారి మళ్ల్లీంచినట్లు రైల్వే శాఖ పేర్కొంది. నేడు విశాఖలో బయలుదేరే విశాఖ- టు కిరండూల్ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల మంగళవారం జగదల్‌పూర్ నుంచి బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. పలు సాంకేతిక కారణల వల్ల ఈ చర్యలు తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.