ప్రయాగ్ రాజ్ః దురదృష్టవశాత్తూ జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభమేళా వద్ద మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వీవీఐపీ పాస్ లను అన్నింటినీ రద్దు చేసింది. ఈ ప్రదేశంలో అంబులెన్స్ లు తప్ప మిగతా వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నివారించేందుకు మరిన్ని బలగాలను రంగంలోకి దింపింది.భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. తొక్కిసలాట ఘటన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ను ప్రధాని మోదీని తీవ్రంగా కలచి వేసింది. దీంతో ప్రధాని ఆదేశాల మేరకు యోగి సర్కార్ మహా కుంభమేళా ప్రాంతంలోనే కాదు.. మేళాకు వచ్చిన భక్తులు సందర్శిస్తున్న అయోధ్య, వారణాశి, చిత్రకూట్ ప్రాంతాలలోనూ పూర్తి స్థాయి జాగ్రత్త చర్యలు చేపట్టింది.
ప్రయాగ్ రాజ్ లోకి ఏ వాహనం ప్రవేశించకుండా సరిహద్దుల్లోనే నిలిపి వేస్తున్నారు. ఇక మేళా ప్రదేశంలో వన్ వే నిబంధనలను ప్రవేశపెట్టారు. ఒక మార్గంలో ప్రవేశం, మరో మార్గంలో నిష్క్రమణ తప్ప.. మధ్యలో ఎలాంటి గుంపులు గుమికూడకుండా గట్టిగా పోలీసులు ఎన్ డిఆర్ ఐ సిబ్బందిని అప్రమత్తం చేశారు. మేళా వద్ద జనాలను నియంత్రించడంలో మహా కుంభమేళా నిర్వాహకులకు సహాయంగా సినియర్ సెక్రటరీ స్థాయికి చెందిన ఐదుగురు సీనియర్ అధికారులను యోగి సర్కార్ పంపించింది. మొన్నటి వరకూ ఈ అధికారులు ప్రయాగ్ రాజ్ లో ఉండేవారు.
మహా కుంభమేళాలో సాధారణ రోజుల్లో యాత్రికులతో పాటు , ఫిబ్రవరి 3 వసంత పంచమి రోజున, మూడో ముఖ్యమైన అమృత్ స్నాన్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లకు సర్కార్ సిద్ధమైంది.ఇప్పటికే కుంభమేళాను సందర్శించిన యాత్రికులను ప్రయాగ్రాజ్లోని వివిధ రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్దకు, తిరిగి ఇంటికి పంపివేసేందుకు అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అదనపు బస్సులను సిద్ధం చేసింది. మరో పక్క భారీఎత్తున జనం రావడంతో అయోధ్యలోనూ, వారణాశి లోనూ అదనపు బలగాలను పంపించారు. చిత్రకూట్ కు వాహనాలు వెళ్లకుండా నిషేధించారు. వారణాశి రైల్వే స్టేషన్ సమీపంలో భక్తులు రాత్రిపూట ఉండి, తమతమ రైళ్లకోసం నిరీక్షించేందుకు వీలుగా నైట్ షల్టర్లు ఏర్పాటు చేసారు.