Thursday, January 9, 2025

ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల తంటాలు

- Advertisement -
- Advertisement -
ఓటర్ అంతరంగం తెలుసుకునేందుకు అభ్యర్థుల పోటీ

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో గుబులు పుడుతోంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నాయి. వారి మదిలో ఏముందో మాత్రం అంతుచిక్కకపోవడంతో నాయకులు పరేషాన్ అవుతున్నారు. ఓటరు అంతరంగం తెలుసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. విజయంపై ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నా లోలోపల ఓటర్ల మనసు గుర్తించలేక అభ్యర్థులు మథనపడుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు, అనుచరులు గెలుపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారు. ఉదయాన్నే పల్లెలకు వెళ్లి ప్రచారం చేసినా రాత్రివేళ ఆ గ్రామంలోని తమ పార్టీ పరిస్థితులపై కూపీ లాగుతున్నారు. ఏ పార్టీ ప్రచారం జరిగినా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు. దీంతో వారు ఎన్నికల్లో ఎవరికీ మద్ధతు తెలుపుతారో తెలియక నేతలు, అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిలతో పాటు బిఎస్పీ, కొన్ని నియోజకవర్గాల్లో స్వతంత్రులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఓటరు నాడీ అర్థం కాక అభ్యర్థులు తికమక పడుతున్నారు.
వెనువెంటనే కండువాలు మారుస్తున్న అనుచరులు
ఇప్పటికే ఆయా పార్టీల్లోని నేతలు, అనుచరులు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుతుండటం అభ్యర్థులను కలవరానికి గురి చేస్తుంది. అదేవిధంగా ఎవరన్నా పార్టీ మారితే అవతలి పార్టీ నాయకులు తమ వైపు వచ్చేలా దృష్టి పెట్టడానికే ఎక్కువ సమయం సరిపోతోందని అభ్యర్థులు వాపోతున్నారు. మీ వెంటే మేము అంటూ కలిసి తిరిగిన నేతలు, శ్రేణులు మరుసటి రోజే కండువాలు మారుస్తుండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరిని నమ్మి వ్యూహాలు పంచుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు.
వ్యూహాలు మార్చుతున్న అభ్యర్థులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రస్తుతం ఎన్ని వచ్చే అవకాశాలున్నాయి? గ్రామాల వారీగా తమ ఓటు బ్యాంకు ఎంత? సామాజిక వర్గాల వారీగా మద్ధతు ఎలా ఉండవచ్చు. నేతల పార్టీల మార్పుతో కలిగే నష్టం తదితర అంశాలు నాయకులు, అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా కొందరికీ బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ బలంగా ఉన్నాం, ఎక్కడ బలహీనపడ్డామన్న వివరాలు సేకరిస్తూ అందుకనుగుణంగా వారు వ్యూహాలు మార్చుకుంటున్నారు.
ఓటరు వ్యక్తిగత, పార్టీ వివరాలు ఆరా తీసి…
మరోవైపు బహిరంగ సభలు, రోడ్ షోలకు హాజరైన ప్రజలతో నేతలు ప్రత్యేకంగా మాట్లాడిస్తున్నారు. ఓటరు వ్యక్తిగత, పార్టీ వివరాలు ఆరా తీసి అనంతరం ఆ పార్టీయే గెలుస్తుందని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో ఓటరు నాడీ పట్టుకోవడం కష్టంగా మారిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎన్నికలకు రెండు రోజుల సమయం ఉండటంతో తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరించి గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు వెళ్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News