Monday, December 23, 2024

హంగు, ఆర్భాటాల కోసం అధికంగా జనాలు ఉండేలా అభ్యర్థుల ఆరాటం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు తమ వెంట జనాలు ఎక్కువగా కనబడేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం వారికి రోజువారీగా డబ్బులు చెల్లిస్తున్నారు. ఓ వైపు ప్రధాన పార్టీలైన బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపిలు ముఖ్య నాయకులతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో అభ్యర్థులు తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ కోసం కొందరు మరో ఛాన్స్ కోసం మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో వారు పడ్డారు. ఇందుకోసం అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు.

రెండుపూటలా పాల్గొంటే రూ. 500లు
ఫలితంగా అభ్యర్థులు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ హంగు ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ వెంట ఎంత మంది ఎక్కువగా ఉంటే అంత ప్రజాబలం ఉన్నట్లుగా ఓటర్లు భావిస్తారని వారు నమ్ముతున్నారు. తద్వారా పెద్ద సంఖ్యలో జనాలను పోగు చేయడంపై వారు దృష్టి పెట్టారు. మరోవైపు గ్రామ, పట్టణస్థాయి నేతలు తమ పార్టీల అభ్యర్థుల తరపున ఓటర్లను కలిసేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. వారు కూడా కనీసం 50 నుంచి 100 మందితో కదులుతున్నారు. ఇందుకోసం రోజువారీ కూలీలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచారంలోనే పాల్గొనే వారికి ఒకపూట పాల్గొంటే కనీసం రూ.300 ఇచ్చేలా ఉదయం, సాయంత్రం రెండుపూటలా పాల్గొంటే రూ.500 ఇచ్చి, భోజనం పెట్టేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రచారానికి వస్తున్న వారు తమ కూలీని ఎప్పటికప్పుడే తీసుకుంటున్నారు. వారానికోసారి ఇస్తామంటే ఒప్పుకోవడం లేదు. సాయంత్రం ప్రచారం ముగిసిన వెంటనే గ్రామాల్లో ఆయా పార్టీల నేతల ఇంటివద్ద క్యూ కడుతున్నారు. ఒకవేళ ఏదైనా సమస్యతో నగదు చెల్లింపులో ఆలస్యం చేస్తే మరుసటి రోజున వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
ట్రాక్టర్లు, బస్సులోకి ఎక్కేముందే నగదు…
బహిరంగ సభలకు వెళ్తున్న వారికి రోజుకి కొన్ని పార్టీలు రూ.500 ఇస్తే, మరికొన్ని రూ.800ల వరకు చెల్లిస్తున్నాయి. చాలావరకు ట్రాక్టర్లు, బస్సులోకి ఎక్కేముందే నగదు తీసుకుంటున్నారు. లేదంటే సభ ముగిసిన వెంటనే నాయకుడి ఇంటివద్దకు చేరుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో బూత్ స్థాయి నాయకులు చివరి వరకు తమతో ప్రచారంలో ఉండేదుకు అభ్యర్థులు భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారు. దీనికి తోడుగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని పరిగెత్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన మహిళా సంఘాలను బరిలోకి దింపుతున్నారు. జిల్లాల్లో చాలాచోట్ల వీటి ప్రచార బృందాలు సందడి చేస్తున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులు జట్లుగా మండలాలకు చేరుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News