మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎంఎల్‌ఎ అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. కెసిఆర్ అధికారంలోలేని తెలంగాణను ఊహించుకోలేక పోతున్నామంటూ చొప్పదండు మాజీ ఎంఎల్‌ఎ సుంకె రవి శంకర్ కన్నీరు పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో జరిగన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇక ముందు ప్రజల మధ్య ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
‘ప్రత్యేక తెలంగాణను కొట్లాడి తెచ్చిన కెసిఆర్ లేడే’ అంటూ ఇతర రాష్ట్రాల వారు అంటున్నారని ఆవేదన చెందారు. అలాగే భువనగిరి మాజీ ఎంఎల్‌ఎ పైళ్ల శేఖర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశం ముగించుకొని వెళుతున్న సమయంలో ఎదురు వచ్చిన మహిళా నాయకులు, కార్యకర్తలు ఏడవడంతో ఆయన కూడా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. కార్యకర్తలను ఓదార్చి ధైర్యం చెప్పారు. నియోజకవర్గాన్ని ఇంతగా అభివృద్ధి చేసినా.. ఈ విధంగా తీర్పును ఇవ్వడం దురదృష్టకరమని మహబూబాబాద్ మాజీ ఎంఎల్‌ఎ శంకర్ నాయక్ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీలో కోవర్టులు ఎక్కువగా ఉండడం వల్లే ఓటమి చెందామని చెప్పారు. ఇలాంటి విషయాలపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.