Saturday, November 16, 2024

కాషాయం పుచ్చుకుంటే కేసులుండవా?

- Advertisement -
- Advertisement -

ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థుల్లో చాలామందికి నేరచరిత్ర ఉన్నట్టు వారి అఫిడవిట్లలో బయటపడింది. ఇప్పటివరకు ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలు 763 మందిలో 306 మందిపై క్రిమినల్ కేసులు, 194 మంది పై సీరియస్ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు వారు సమర్పించిన అఫిడవిట్ల బట్టి బయటపడిందని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్ నిర్వహించిన విశ్లేషణ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణల పాలైన దాదాపు 25 మంది ప్రఖ్యాత రాజకీయ నేతలు 2014 నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను ఎదుర్కొంటుండడంతో వారంతా బిజెపిలోకి మారిపోయారు.

వీరిలో కాంగ్రెస్ నుంచి 10 మంది, ఎన్‌సిపి, శివసేన నుంచి నలుగురేసి వంతున, టిఎంసి నుంచి ముగ్గురు, తెలుగు దేశం నుంచి ఇద్దరు, ఎస్‌పి నుంచి ఒకరు, వైసిపి నుంచి ఒకరు కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కేసుల్లో 23 కేసులకు సంబంధించిన వారి రాజకీయ ఎత్తుగడ చట్టపరమైన ఉపశమనంగా మారింది. వీటిలో మూడు కేసులు ఎత్తివేయబడ్డాయి. మిగతా 20 కేసులు నిలిచిపోయాయి. లేదా కోల్డ్ స్టోరేజికి చేరాయి. వారు పార్టీ మారిన తరువాత దర్యాప్తు సంస్థల దర్యాప్తు వాస్తవానికి నిష్క్రియగా మారిపోయింది.

ఈ జాబితాలో ఉన్న ఆరుగురు నేతలు కేవలం ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందుగా బిజెపిలోకి మారిపోయారు. ఈ నిందితులే విపక్షంలో ఉంటే ఏం జరిగేదో అన్నది తీవ్ర విరుద్ధకరమైన విషయం. ప్రఖ్యాత విపక్ష రాజకీయ నేతల్లో 95% మంది పై ఎన్‌డిఎ అధికారంలోకి రాగానే 2014 తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇడి, సిబిఐ ఏ విధమైన చర్యలు తీసుకున్నాయో తెలిసిందే. అందుకే విపక్షం దీన్ని ‘వాషింగ్ మెషిన్’గా వ్యాఖ్యానిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు తమ పార్టీలను విడిచిపెట్టి కాషాయం పుచ్చుకుంటే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉండవని తేలింది.

ఇది ఇప్పటి ప్రక్రియ కాదు. గతంలో కూడా జరిగింది. 2009లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన పరిశోధనలో బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఎస్‌పి అధినేత మూలాయం సింగ్ యాదవ్‌పై సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసులు తరువాత చల్లబడిపోయాయి. తాజా పరిశోధనల్లో మహారాష్ట్రలో 2022 నుంచి 2023 వరకు రాజకీయ సంక్షోభంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి కేంద్రీకరించాయి. 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే వర్గం విడిపోయి బిజెపితో పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

సంవత్సరం తరువాత ఎన్‌సిపి నుంచి అజిత్ పవార్ వర్గం విడిపోయి అధికార ఎన్‌డిఎ సంకీర్ణంలో చేరిపోయింది. ఎన్‌సిపి వర్గంలోని అగ్రనేతలు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్‌పై ఉన్న కేసులు క్రమంగా ఎత్తివేయబడ్డాయి. మహారాష్ట్రలో 25 మంది జాబితాలో 12 మంది ప్రఖ్యాత రాజకీయ నేతల్లో 11 మంది 2022 లో బిజెపిలో చేరారు. వీరిలో ఎన్‌సిపి, శివసేన, కాంగ్రెస్ నుంచి నలుగురేసి వంతున బిజెపిలో చేరారు. ఈ కేసుల్లో కొన్ని కఠోర చిత్రాన్ని చూపిస్తాయి. అజిత్ పవార్ కేసులో ఆయన ఇదివరకటి ప్రభుత్వంలో భాగమైనప్పుడు ముంబై పోలీస్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఇఒడబ్లు) 2020లో కేసును మూసివేస్తూ నివేదిక దాఖలు చేసింది. బిజెపి అధికారంలోకి రాగానే ఆ కేసును తిరిగి తెరవాలనుకుంది.

ఆయన ఎన్‌డిఎలో చేరగానే ఈ ఏడాది మార్చిలో మళ్లీ కేసును ఎత్తివేసింది. ఆర్థిక నేర విభాగం చర్య ఆధారంగా పవార్‌కు వ్యతిరేకంగా దాఖలైన కేసు అప్పటి నుండి నిరుపయోగంగా మార్చబడింది. కొన్ని కేసులు పేరుకే అలాగ ఉన్నాయి తప్ప వాటి దర్యాప్తులో ఎలాంటి పురోగతి ఉండడం లేదు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ విపక్ష నాయకుడు సువేందు అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి లోక్‌సభ స్పీకర్ నుంచి అనుమతి కోసం 2019 నుంచి సిబిఐ నిరీక్షిస్తోంది. పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్‌స్‌క్రు చెందిన 13 మంది 2017లో నారద న్యూస్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఆ 13 మందిలో అప్పటికి ఎంపి అయిన సువేందు అధికారి కూడా ఉన్నాడు. అయితే 2020 లో సువేందు అధికారి టిఎంసి నుంచి బిజెపిలోకి ఫిరాయించాడు.

అసోం సిఎం హేమంత బిశ్వా శర్మ, మాజీ మహారాష్ట్ర సిఎం అశోక్ చవాన్‌పై కూడా కేసులు ఉన్నాయి. శారదా చిట్‌ఫండ్ స్కామ్ కేసులో 2014 లో బిశ్వాపై సిబిఐ దాడులు జరపడమేకాక ప్రశ్నించింది కూడా. 2015లో ఆయన బిజెపిలో చేరగానే ఆ కేసు ముందుకు సాగలేదు. ఆదర్శ హౌసింగ్ కేసులో సిబిఐ, ఇడి విచారణలపై సుప్రీం కోర్టు స్టే విధించినప్పటికీ ఈ ఏడాది చవాన్ బిజెపిలో చేరారు. 25 కేసుల్లో మాజీ కాంగ్రెస్ ఎంపి జ్యోతి మీర్ధా, మాజీ టిడిపి ఎంపి వైఎస్ చౌదరిపై కూడా రెండు కేసులు ఉన్నాయి. వీరిద్దరూ బిజెపిలో చేరినప్పటికీ, ఇడి ఆ కేసుల్ని విడిచిపెట్టిన ఆధారాలు లేవు. వీరి కేసుల్లో తాజా దర్యాప్తుల గురించి తమ వ్యాఖ్యానాలు ఏమిటని సిబిఐ, ఇడి, ఇన్‌కమ్ టాక్స్ విభాగాలను ప్రశ్నించినా స్పందించడం లేదు. ఏజెన్సీ సంస్థల దర్యాప్తు అంతా సాక్షాధారాల బట్టి ఉంటుందని సిబిఐ అధికారి ఒకరు చెప్పారు.

ఎప్పుడైతే తగిన సాక్షాధారాలు లభిస్తాయో సరైన చర్య తీసుకోవడమవుతుందని పేర్కొన్నారు. నిందితులు పార్టీలు ఫిరాయించగానే ఏజెన్సీలు తమ దర్యాప్తు తీరును ఎందుకు మార్చేస్తుంటారు? అని ప్రశ్నించగా, కొన్ని కేసుల్లో వివిధ కారణాల వల్ల చర్యలు తీసుకోవడం ఆలస్యమవుతుంది. అయితే ఆ కేసులు అలాగే ఉంటాయి తప్ప మూసివేయడం జరగదు అని సిబిఐ అధికారి ఒకరు వివరించారు. ఇతర ఏజెన్సీలు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై కేసులు ఉంటాయని ఇడి అధికారి ఒకరు తెలియజేశారు. ఇతర ఏజెన్సీలు కేసులను ముగించితే వాటిపై దర్యాప్తు ముందుకు సాగడం కష్టమవుతుందని ఇడి అధికారి చెప్పారు. అలాంటి కేసుల్లో ఇంకా ఛార్జిషీట్ దాఖలు చేయవలసి ఉందన్నారు.

పి. వెంకటేశం
9985725591

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News