Sunday, December 22, 2024

ఆ పార్టీలతో ఎవరికి చేటు?

- Advertisement -
- Advertisement -

(ఎం.భుజేందర్/మన తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఏ మేరకు ప్రభావం చూపుతారో.. ఎవరి ఓట్లు చీల్చుతారో అని ప్రధాన పార్టీల అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. రాజకీయాల్లో గెలుపునకు.. ఓటమికి తేడా ఒక్క ఓటే. ఆ ఒక్క ఓటును ఇతర పార్టీలు చీలిస్తే గెలుపోటములు తారుమారవుతాయి. చాలా నియోజకవర్గాలలో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండటంతో తెలంగాణలో ఈ సారి చిన్న పార్టీలు చీల్చే ఓట్లే ప్రధాన పార్టీల జాతకాన్ని మార్చే అవకాశమూ లేకపోలేదు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. తమకు గుర్తు కేటాయించని కారణంగా ప్రజాశాంతి పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు.

ఈ రెండు పార్టీలకు పెద్దగా ఓటు బ్యాంకు లేకపోయినా కొంతమేర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు వైఎస్ షర్మిల పిలుపు మేరకు పరిమిత సంఖ్యలో ఓట్లు వేసే అవకాశం ఉంది. అలాగే ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదు కాబట్టి ఓటర్లు నోటాకు ఓటు వేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పోటీలోనే లేవు కాబట్టి ఈ పార్టీలు అంతగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. ఇక టిడిపి సానుభూతి పరుల ఓట్ల కోసం అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఒక వేళ టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని ఓట్లు చీల్చేదేమో. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి పోటీ దూరంగా ఉండటంతో ఆ పార్టీ సానుభూతిపరులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని నియోజకవర్గాలలో టిడిపి సానుభూతిపరులు, చంద్రబాబు నాయుడు అభిమానులు ఓట్లు గెలుపు ఓటములను నిర్ణయించే అవకావమూ లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జనసేన, బిఎస్‌పి గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయా?
జనసేన ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉంది కాబట్టి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్‌కల్యాణ్‌కు తెలంగాణ యువతలో పెద్దయెత్తున అభిమానులున్నారు. పవన్ చెప్పింది విని వీరిలో ఎంతమంది జనసేనకు ఓటేస్తారన్నది ప్రశ్నార్థకమే అయినా, పడే ఓట్లు మాత్రం సాధారణంగా మూడు ప్రధాన పార్టీల ఓట్లనూ సమానంగా చీల్చవచ్చు. సమర్థుడైన పోలీసు అధికారిగా, గురుకులాల కార్యదర్శిగా పేరు తెచ్చుకున్న ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తన సర్వీసుకు రాజీనామా చేసి బిఎస్‌పి పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలలో బిఎస్‌పి సానుభూతిపరులు ఉంటారు.

ఇప్పటిదాకా ఈ వర్గాలు అయితే అధికార బిఆర్‌ఎస్‌కో లేదంటే కాంగ్రెస్ పార్టీకో ఓటు వేస్తూ వస్తున్నాయి. అయితే ఈసారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వయంగా పోటీ చేయడంతో పాటు మెజారిటీ నియోజకవర్గాలలో తమ పార్టీ తరపున అభ్యర్థులను ఎన్నికలో పోటీ చేయిస్తున్నారు. ఈఎన్నికలలో బిఎస్‌పి పోటీ చేసే సెగ్మెంట్లలో ఎవరికి నష్టం జరుగుతుంది..? ఎవరికి లాభం జరుగుందో అని ప్రధాన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విశ్లేషించుకుంటున్నారు. సిపిఐ, సిపిఐ(ఎం) ఉనికిని తీసివేయలేం. ఒకప్పుడు ప్రజా ఉద్యమాలతో ఓ వెలుగు వెలిగిన ఈ పార్టీలు ప్రస్తుతం కొన్ని పరిమిత స్థానాలలోనే పోటీ చేస్తున్నప్పటికీ, ఇతర స్థానాలలో గెలుపును ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News