Monday, January 20, 2025

రాష్ట్రంలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం

- Advertisement -
- Advertisement -

ఇప్పటి వరకూ వాహనాల్లో… తాజాగా రైళ్లలో అక్రమ రవాణా
అధికారుల దాడుల్లో భారీగా పట్టుపడుతున్న గంజాయి
అక్రమార్కులపై ఎక్సైజ్‌శాఖ పటిష్టమైన నిఘా

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ ప్రాంతంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్, పోలీస్‌శాఖలతో పాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించిన నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. మత్తు మందుల్లో గంజాయి ఒక రకం. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, అర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి సాగు ఎక్కువగా ఉంది. ఎపిలోనూ అక్కడక్కడా గంజాయిని పండిస్తున్నారు. ఈ గంజాయిని హైదరాబాద్‌కు సరఫరా చేసి డబ్బులు సంపాదించడానికి అక్రమార్కులు రోజకో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైయ్యారు.

ఇటీవల ఎక్సైజ్, పోలీస్, రైల్వే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకూ ఒరిస్సా, భువనేశ్వర్ మీదుగా.. ఖమ్మం నుండి గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండేవారు. గంజాయిన పట్టుకోవడానికి నిర్వహిస్తున్న దాడుల్లో కార్లలోనూ, కార్ల డిక్కీల్లోనూ, కార్ డోర్లలోనూ ఎండిపోయిన గంజాయిని ప్యాకెట్లుగా మార్చి రవాణ చేస్తు అధికారులకు పట్టుబడుతున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఇటీవల నిర్వహించిన దాడుల్లో పలు వాహనాలను సీజ్ చేశారు. కార్లలో గంజాయిని సరఫరా చేస్తుంటే పోలీసులకు దొరికితే కారుతోపాటు డ్రైవర్, ఓనర్‌లపై కేసులు నమోదు చేస్తుండటంతో గంజాయిని అక్రమ రవాణా చేసే వారు సరికొత్త మార్గాలను ఎన్నుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో గంజాయిని రైళ్లలో సరఫరా చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఎక్సైజ్‌శాఖ పోలీసుల సహకారంతో రైళ్లలో సోదాలు నిర్వహిస్తూ గంజాయిని పెద్ద ఎత్తును స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్ మీదుగా వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ గంజాయిని రవాణా చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌శాఖ రైల్వే పోలీసుల సహకారంతో గంజాయిని పట్టుకున్నారు. రైళ్లలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్నా.. నిందితులు.. అక్రమార్కులు మాత్రం తప్పించుకుంటున్నారు.

జనవరి 2024 నుండి ఏప్రిల్ వరకూ తెలంగాణ ఎక్సైజ్‌శాఖ 2283.76 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఎన్నికల అనంతరం భద్రాచలంలో వరుసగా 492 కేజీలు, 26, 39.5 కేజీలు. తాండూరులో 56, సికింద్రాబాద్‌లో 62 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిత్యం గంజాయి పట్టుకుంటున్న ఎక్సైజ్ శాఖ యంత్రాంగాన్ని అబ్కారీశాఖ కమిషనర్ ఇ.శ్రీధర్, డైరెక్టర్ కమలహాసన్‌రెడ్డి అభినందించారు. ఇదే తీరులో హైదరాబాద్‌లో వరుసగా మూడు చోట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. కార్లలో, రైళ్లలో గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తూ పట్టుపడుతూండటంతో అక్రమార్కులు తీవ్ర భయంతో వణికిపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News