గంజాయి చాక్లెట్లు నగరానికి తీసుకుని వస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 24కిలోలు ఉన్న 120 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్ల విలువ రూ.2లక్షలు ఉంటుంది. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం…..ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోరక్ సాహా అనే వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రం నుంచి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తున్నాడు. నగరంలోని కూకట్‌పల్లిలో హాస్టల్స్, టీ పాయింట్లు, పాన్ షాపుల వారికి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నాడు.
వారి ఇతడి వద్ద కొనుగొలు చేసిన గంజాయి చాక్లెట్లను అవసరం ఉన్న వారికి రూ.40 లకు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. నిందితుడు గంజాయి చాక్లెట్లు రవాణా చేస్తున్న విషయం ఎక్సైజ్ సిబ్బందికి తెలియడంతో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే గంజాయి చాక్లెట్లు తీసుకుని రాజస్థాన్ నుంచి రైలులో వస్తుండగా నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి చాక్లెట్లను పట్టుకున్న ఎస్టీఎఫ్ టీమ్‌ల సీఐలు చంద్రశేఖర్, బిక్షారెడ్డి, వెంకటేశ్వర్లు, నాగరాజు సిబ్బంది ఉన్నారు.