పెద్ద ఎత్తున విక్రయాలు
సులభంగా డబ్బులు వస్తాయనే ఆశ
పెద్ద ఎత్తున గంజాయి పట్టుకుంటున్న పోలీసులు
పోలీసులు పట్టుకుంటున్నా బయపడడంలేదు
హైదరాబాద్: నగరంలో మళ్లీ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలోని ప్రతి ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చిన ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయిస్తున్న వారికి భారీగా లాభాలు వస్తుండడంతో చాలామంది యువకులు గంజాయి విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. గత పది రోజుల్లో బహిరంగ ప్రదేశాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏకంగా బైక్‌లపై తీసుకుని వచ్చి ఆటో స్టాండ్‌లు, బస్‌స్టాండ్‌లు, జనసమ్మర్దం బాగా ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. వివిధ ప్రాంతాలను అడ్డాగా ఉపయోగించుకుంటున్నారు. గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయించేవారు.
ఇప్పుడు గంజాయిని విక్రయిస్తున్నారు. ఎపిలోని విశాఖపట్టనం, ఒడిసా నుంచి నగరానికి ఎక్కువగా గంజాయి సరఫరా అవుతోంది. అలాగే ఇక్కడి నుంచి గంజాయి స్మగ్లర్లు కర్నాటక రాష్ట్రానికి కూడా సరఫరా చేస్తున్నారు. నగరానికి చెందిన శివశంకర్ రెడ్డి ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. ఇతడికి దుర్గాబాయి, నర్సింహ సహకరిస్తున్నాడు. వీరిని పట్టుకున్న పోలీసులు రూ.6.70లక్షల విలువైన 96 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. సోమాజిగూడలోని ఓ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తున్న యువకుడి నుంచి ఏడు కిలోలు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై గంజాయి ప్యాకెట్లు పెట్టుకుని బహిరంగంగా విక్రయిస్తున్నారు. కొత్తపేట పండ్ల మార్కెట్‌కు పండ్లను సరఫరా చేస్తున్న నగరంలోని సరూర్‌నగర్‌కు చెందిన మేత్రి రాజ్‌కుమార్ ఎపిలోని రాజమండ్రి నుంచి గంజాయి తీసుకుని వస్తుపట్టుబడ్డాడు.
పండ్ల మాటున ఏకంగా రూ.40లక్షల విలువైన 320కిలోల గంజాయిని తరలిస్తు నగర శివారులో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. నిందితులు ఇక్కడ నుంచి కర్నాటక, బీదర్‌కు తరలించేందుకు హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకున్నారు. సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దురాషతో నిందితుడు భారీ ఎత్తున గంజాయి తరలిస్తు పోలీసులకు పట్టుబడ్డాడు. గంజాయిని రాజమండ్రిలో రూ.6,000లకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి రూ.10, 12వేలకు విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తున్న వారు చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి రూ.1,200కు చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భారీగా లాభాలు రావడంతో పోలీసులు ఎంతమందిని పట్టుకున్నా, బయటికి వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి విక్రయిస్తున్నారు.
జైలు నుంచి వచ్చిన తర్వాత మారకుండా మళ్లీ గంజాయి విక్రయిస్తుండడంతో వారిపై పోలీసులు పిడి యాక్ట్ పెడుతున్నారు. గతంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సులభంగా డబ్బులు సంపాదించవచ్చని గంజాయి విక్రయించాడు. పోలీసులు పట్టుకోవడంతో కటకటాలపాలయ్యాడు. డిఆర్‌ఐ అధికారులు భద్రాచలం నుంచి బీదర్‌కు తరలిచేందుకు తీసుకువస్తున్న డిసిఎం వ్యాన్‌ను తనిఖీ చేయడంతో 1,335 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.2కోట్లకుపైగా ఉంటుంది. గతంలో తక్కువ మొత్తంలో గంజాయి తరలించే నేరస్థులు ఇప్పుడు వందల కిలోలు తరలిస్తున్నారు. పోలీసులు, శిక్షలు తదితరాల గురించి ఏమాత్రం బయపడడంలేదని తెలుస్తోంది. భారీగా లభించే లాభాలే వీరిని గంజాయి స్మగ్లింగ్‌కు ఉసిగొల్పుతున్నట్లు తెలుస్తోంది.
బహిరంగంగా గంజాయి విక్రయం…..
గతంలో గంజాయి విక్రయించే వారు చాలా జాగ్రత్తలు తీసుకుని తెలిసిన వారికి మాత్రమే గంజాయిని విక్రయించేవారు. ఇప్పటి వరకు నగరంలో గంజాయి విక్రయాలు అనేవి ఎవరికీ తెలియకుండా చేసేవారు. కాని ప్రస్థుతం గంజాయి విక్రయించే వారు బహిరంగంగా విక్రయిస్తున్నారు. బైక్‌లపై తీసుకుని వచ్చి చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని నింపి విక్రయిస్తున్నారు. ఇలా నగరంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా లేబర్ అడ్డాల్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ పనిచేసేందుకు వస్తున్నారు. వారు మత్తు కోసం గంజాయిని ఆశ్రయిస్తున్నారు. నగరంలో సులభంగా గంజాయి లభిస్తుండడంతో విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో నగరంలోని మంగళ్‌హాట్, ధూల్‌పేట తదితర ప్రాంతాల్లో చాలా రహస్యంగా విక్రయించేవారు. ఇప్పుడు నగరంలోని అన్ని ప్రాంతాల్లో గంజాయి విక్రయం జోరుగా కొనసాగుతోంది.