* రెండు బైకులు స్వాధీనం, నలుగురి అరెస్ట్
భద్రాచలం: భద్రాచలం ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు బైకుల్లో అక్రమంగా తరలిస్తున్న 28 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు భద్రాచలం ఎఎస్పి డా. వినీత్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం…. మంగళవారం ఉదయం 8 గంటలకు పట్టణ సిఐ స్వామి ఆధ్వర్యంలో ప్రొబిషనరీ ఎస్ఐబి సాయి కిశోర్‌రెడ్డి సిబ్బందితో కలిసి స్థానిక ఫారెస్ట్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు బైకుల్లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అనుమానంగా కనిపించడంతో వారిని సోదా చేశారు. వారి వద్ద సుమారు రూ. 4 లక్షల 20 వేలు విలువ గల 28 కేజీల గంజాయి దొరికినట్లు తెలిపారు. నిందితులలో ఒక మహిళ కూడా ఉంది. స్మగ్లర్లు విశాఖపట్నంకు చెందిన కొర్ర రవి, కిలో భగవాన్, కొర్ర రాజారావు, పంగి బాలమ్మలు పోలీసులు గుర్తించారు. వీరు సీలేరు నుండి హైదరాబాద్‌కు ఈ గంజాయి రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో నిరంతరం పోలీసుల తనిఖీలు ఉంటాయని, నిషేధిత వస్తువులు, గంజాయి వంటి మాదకద్రవ్యాలను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.