Thursday, January 23, 2025

ఆప్ నుంచి ఒక్క ఎమ్‌ఎల్‌ఎను కూడా కొనలేరు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన ఢిల్లీ సీఎం

Kejriwal

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీఆప్ మధ్య రాజకీయ విభేదాలు ముదిరిన వేళ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సొంత ప్రభుత్వం పైనే విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు మొదలైన తరువాత సీఎం ప్రసంగించారు. అనంతరం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అంతకు ముందు బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు ఆందోళనకు దిగడంతో సభలో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఆ ఎమ్‌ఎల్‌ఎలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కాషాయ పార్టీ ‘ఆపరేషన్ కమలం ’ ఢిల్లీలో విఫలమైందని నిరూపించేందుకే తాను ఈ విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చానని చెప్పారు. ఆప్ ఎమ్‌ఎల్‌ఎలు నిజాయతీపరులని, పార్టీకి విధేయులుగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మణిపుర్, బీహార్, అస్సాం, మహారాష్ట్ర, ప్రభుత్వాలను వారు (బీజేపీని ఉద్దేశిస్తూ) కూల్చేశారు. కొన్ని చోట్ల అయితే ఒక్కో ఎమ్‌ఎల్‌ఎను రూ. 50 కోట్ల చొప్పున కొనేశారు. ఢిల్లీ లోనూ అలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఆప్‌ను వీడి బీజేపీలో చేరితే రూ. 20 కోట్లు ఇస్తామంటూ 12 మంది ఎమ్‌ఎల్‌ఎలకు ఆఫర్ చేశారు. కానీ బీజేపీ ఆపరేషన్ కమల్ విఫలమైంది. మా ఎమ్‌ఎల్‌ఎలు నిజాయతీపరులు మా పార్టీ నుంచి ఒక్క ఎమ్‌ఎల్‌ఎను కూడా వారు కొనుగోలు చేయలేరని రుజువు చేసేందుకే ఈ తీర్మానం తీసుకొచ్చా ” అని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. త్వరలో ఇంధన ధరలు మరింత పెరుగుతాయని, ఈ రేట్ల పెంపుతో వచ్చిన ఆదాయాన్ని ఎమ్‌ఎల్‌ఎలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తున్నారని కేంద్రంపై ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఈ విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.

బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలను బయటకు పంపేసి…

అంతకు ముందు అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్‌ఎల్‌ఎలు ఆందోళనకు దిగారు. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానం, తరగతి గదుల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు డిప్యూటీ స్పీకర్ అంగీకరించక పోవడంతో ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో వారు సభ నుంచి బయటకు వెళ్లి పోవాలని డిప్యూటీ స్పీకర్ ఆదేశించారు. వారు వినిపించుకోక పోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News