మంచినీరు, కరెంట్ కట్ చేస్తా
హైదరాబాద్‌ను విశ్వనగరం చేయడానికి వేలకోట్లు ఖర్చు చేస్తుంటే, కంటోన్మెంట్ అధికారులు ఏ విషయంలోనూ సహకరించడం లేదు
పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సరైన స్పందన రాలేదు
ఇప్పటివరకు మౌనంగా భరించాం
ఇకపై సహకరించేది లేదు
ప్రజల మేలుకోసం ఎంతదూరమైనా పోతాం
రోడ్లు బంద్ చేస్తాం, నాలాల మీద చెక్‌డ్యాంలు కడతామంటే చూస్తూ ఊరుకోం
శాసనసభలో పురపాలక శాఖ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఇదే వారికి చివరి అవకాశం! చెప్పినట్లు వినకపోయినా… తీరు మార్చుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కఠిన నిర్ణయాలు తప్పవంటూ కంటోన్మెంట్ అధికారులను పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ప్రజల కోసం మరోసారి వారితో చర్చలు జరుపుతాం… పురోగతి కనిపించని పక్షంలో అవసరమైతే వారికి నీరు, కరెంట్ సరఫరాను కూడా నిలిపివేస్తామన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందన్నారు. అయితే కేంద్రం పరిధిలోని కంటోన్మెంట్ (మిలిటరీ) ప్రాంత అధికారులు మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ వారు సహకరించం లేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని పలుమార్లు తాము కేంద్రం దృష్టికి తీసుకపోయినప్పటికీ సరైన స్పందన రావడం లేదన్నారు. ఇప్పటి వరకు మౌనంగా అన్నీ భరించామన్నారు. ఇకపై మాత్రం సహించేది లేదన్నారు.
ప్రజల కోసం ఎంత దూరమైన పోతామని సాక్షాత్తూ అసెంబ్లీ సమావేశాల్లోనే కేంద్రంపై మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్ నాలా అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి కెటిఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం ఎంతకైనా తెగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌పై కేంద్రానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కార్వాన్‌లో బల్కంపేట నాలాపై (కంటోన్మెంట్ ఏరియా) చెక్‌డాం కట్టడం వల్ల కాలనీలు మునిగిపోతున్నాయన్నారు. ముఖ్యంగా వరదలు వచ్చిన సమయంలో పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునుగుతున్నాయన్నారు.శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఎఎస్‌ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ అనుమతి లభించడం లేదన్నారు. ఇలా కంటోన్మెంట్, ఏఎస్‌ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని విమర్శలు గుప్పించారు.
ఈ విషయంపై ఎన్నిసార్లు చెప్పినా అక్కడి అధికారులు తీరు మార్చుకోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ అధికారులను తక్షణమే పిలిచి మాట్లాడాలని అసెంబ్లీలోనే ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తుననామని మంత్రి తెలిపారు. ఒక వేళ వారు వినకపోతే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు రోడ్లు బంద్ చేస్తాం….నాలాల మీద చెక్ డ్యాంలు కడుతామంటే చూస్తూ ఊరుకోమంటూ తేల్చి చెప్పారు. కంటోన్మెంట్ అంటే హైదరాబాద్‌తో కలిసిమెలిసి ఉండాలన్నారు. అంతేతప్ప ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో తెలంగాణ భాగం కానట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం సాయం చేయదు… పనిచేసే వారికి మాత్రం అడ్డంకులు సృష్టిస్తుందని కెటిఆర్ చాలా ఘాటుగా స్పందించారు.
వరదలకు శాశ్వత పరిష్కారం
హైదరాబాద్ నగరానికి వరదల నుంచి శాశ్వత పరిష్కారం చూపించనున్నామన్నాని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఇందుకోసం ప్రఖ్యాత షా కన్సల్‌టెన్సీతో అధ్యయనం చేయించామన్నారు. ఆ సంస్థ ఇచ్చిన నివేదిక ఆదారంగా రూ. 985 కోట్లతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో జిహెచ్‌ఎంసి పరిధిలో రూ. 735 కోట్లు, జిహెచ్‌ఎంసి నుంచి ఒఆర్‌ఆర్ ప్రాంతాల వరకు మరో రూ.250 కోట్లను నాలాల అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామన్నారు. అలాగే హైదరాబాద్‌లో మురికినీరు, మంచినీరు కలవకుండా పక్కాగా చర్యలు చేపడుతున్నట్లు కెటిఆర్ తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్‌లో కలుషిత నీటితో 11 మంది మృతిచెందారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర సర్కార్ పకడ్బంది చర్యలు చేపట్టిందని వివరించారు.
మురికి నీరు, మంచినీరు కలవకుండా పక్కాగా ప్రణాళికలు రూపొందించిందన్నారు. ఆ దిశగా పనులు శరవేగంగాసాగుతున్నాయని పేర్కన్నారు. నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో రూ.3,866 కోట్లతో వంద శాతం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. 2వేల ఎంఎల్‌డిల మురుగునీటి శుద్ధీకరణ సామర్థ్యాన్ని ఏర్పరుచుకున్న నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుందని ఈ సందర్భంగా కెటిఆర్ పేర్కొన్నారు.
కేంద్రం నుంచి అరపైస సాయం రాలే
హైదరాబాద్ (2020)లో వరదలు వచ్చినప్పడు కేంద్రం నుంచి అరపైస సాయం కూడా అందలేదని మంత్రి కెటిఆర్ విమర్శించారు. వరదల సమయంలో కేంద్ర మంత్రులు వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోయారే తప్ప….ఏ ఒక్కరూ రాష్ట్రానికి సాయం చేయడానికి ముందుకు రాలేదని మండిపడ్డారు. అదే గుజరాత్‌లో వరదలు వస్తే ప్రధాని మోడీ స్వయంగా అక్కడికి వెళ్లి రూ. 1000 కోట్లు విరాళంగా ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా నాలాల పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ యత్నిస్తోందన్నారు. మన రాష్ట్రం నుంచి కేంద్రంలో కిషన్‌రెడ్డిప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ దండగేనని అన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇప్పించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారన విమర్శించారు. ఆయన కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టమన్నారు.
రూ.300 కోట్లు ఏ మూలకు సరిపోతాయి
హైదరాబాద్‌కు సాయం చేయాలని అడిగితే కేంద్రం పెద్దలు లక్షకు పైగా జనాభా ఉన్న నగరాలు అమృత్…2లో చేరమని చెప్పారన్నారు. కానీ హైదరాబాద్ నగరంలో కోటికి పైగా జనం నివసిస్తున్నారని…. కేంద్రమిచ్చే రూ.200…..-300 కోట్లు ఏ మూలకు సరిపోతాయని కెటిఆర్ ప్రశ్నించారు.