Monday, December 23, 2024

13 ప్రాంతీయ భాషల్లోనూ సిఎపిఎఫ్ పరీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సిఎపిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలన్న డిమాండ్‌కు కేంద్రం తలొగ్గింది. హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటుగా 13 ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఆ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలుగు, తమిళం, మలయాళంతో పాటుగా ఇతర ప్రాంతీయ భాషల్లో నూ ఈ పరీక్షలను నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో 2024 జనవరి 1నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్రప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. సిఎపిఎఫ్‌లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటుగా ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.

కాగా ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు.‘ ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఇది మన యువత ఆకాంక్షలకు రెక్కలను తొడుగుతుంది. యువత కలలను నెరవేర్చడంలో భాష ఒక అడ్డంకి కాకుండా చూడడానికి మేము చేస్తున్న వివిధ ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు వీలు ఏర్పడుతుందని, తద్వారా వారి ఎంపిక అవకాశాలు కూడా మెరుగుపడతాయని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను మార్చి కానిస్టేబుల్ పరీక్షలను ప్రాంతీయ బాషల్లో నిర్వహించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. హిందీ, ఇంగ్లీషుభాషల్లో మాత్రమే పరీక్షలను నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని సిఎం కెసిఆర్ గతంలోనే ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఇదే విషయమై కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. కేంద్ర సాయుధ బలగాల కింద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సిఆర్‌పిఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్( సిఐఎస్‌ఎఫ్), ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్(ఐటిబిపి), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బి),నేషనల్ సెక్యూరిటీ గార్డ్( ఎన్‌ఎస్‌జి),అస్సాం రైఫిల్స్ వస్తాయి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షల్లో సిఎపిఎఫ్( జిడి) ఒకటి. ఈ పరీక్షలకు దేశం నలుమూలలనుంచి లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News