Sunday, December 22, 2024

‘6200’ కోట్ల పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. ఐటీ కారిడార్లో రూ. 6,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు క్యాపిటాల్యాండ్ ప్రకటించింది. మూడురోజుల క్రితం అమరరాజా గ్రూప్ రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెడతామని 4,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా, ప్రస్తుతం మరో కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో క్యాపిటాల్యాండ్ మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ దాస్ గుప్తా, రియల్ అసెట్స్ సీఈఓ పాట్రిక్ బూకాక్ పాల్గొన్నారు.

2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో….

రూ.6,200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నగరంలోని ఐటీ కారిడార్లో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు క్యాపిటల్యాండ్ తెలిపింది. రూ. 1,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్‌లోని సిఎల్‌ఐఎన్టీ ఇంటర్నేషనల్ టెక్ పార్‌లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐటిపిహెచ్ డేటా సెంటర్ 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో తమకున్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాల్లో మరో రూ. 5 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. మొత్తంగా రూ.6,200 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్లు కంపెనీ తన ప్రణాళికను వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News