న్యూఢిల్లీ : అధికార పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగాఅమరీందర్‌ను నిలబెట్టే అవకాశం ఉందని మాజీ సీఎం కార్యాలయం శనివారం వెల్లడించింది. అమరీందర్ సింగ్ తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఆయన కార్యాలయం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రస్తుతం అమరీందర్ సింగ్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్లారు. గత ఆదివారం ఆపరేషన్ పూర్తయిన తరువాత ప్రధాని మోడీ, కెప్టెన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్టు సమాచారం. లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత కెప్టెన్ తన “ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ( పీఎల్‌సీ) ” పార్టీని బిజెపిలో విలీనం చేయనున్నట్టు శుక్రవారం మీడియా ఛానళ్లలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే మోడీతో అమరీందర్ మంతనాలు జరిపినట్టు సమాచారం. విలీనం అనంతరం కెప్టెన్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అమరీందర్ గత ఏడాది కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే