వారం రోజులుగా మృత్యువుతో పోరాటం
బెంగళూరు సైనిక ఆస్పత్రిలో తుదిశ్వాస
న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది మృతికి దారితీసిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వారం రోజులుగా చికిత్స పొందుతున్న కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం బెంగళూరులోని సైనిక ఆసుపత్రిలో కన్నుమూశారు. వరుణ్ సింగ్ మరణ వార్తను భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఐఎఎఫ్ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. తమిళనాడులోని కూనూరు సమీపంలో ఈ నెల 8న హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో కెప్టెన్ వరుణ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో రావత్ దంపతులతోపాటు మరో 11 మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారు.
గత ఏడాది అక్టోబర్‌లో తాను నడుపుతున్న తేజాస్ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం తలెత్తగా నడుపుతుండగా అసమాన ధైర్య సాహసాన్ని ప్రదర్శించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసినందుకు ఈ ఏడాది ఆగస్టులో కెప్టెన్ వరుణ్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డును అందచేసింది. 39 ఏళ్ల కెప్టెన్ వరుణ్ సింగ్‌కు భార్య, 11 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన తండ్రి కల్నల్(రిటైర్డ్) కెపి సింగ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్(ఎఎడి)లో పనిచేశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన కెప్టెన్ వరుణ్ సింగ్ కుటుంబం ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నివసిస్తోంది. ఈ నెల 8న కూనూరు సమీపంలో జరిగిన ఎంఐ-17వి5 హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన శరీరం తీవ్రంగా కాలిపోగా వెల్లింగ్టన్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. మరుసటి రోజున అక్కడి నుంచి బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృత్యువుతో చివరి క్షణం వరకు పోరాడిన కెప్టెన్ వరుణ్ సింగ్ మరణ వార్త తనను తీవ్ర వేదనకు గురిచేసిందని రాష్ట్రపతి తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారని తెలిపారు. దేశం ఆయనను చూసి గర్విస్తోందని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన దేశానికి అందచేసిన విలువైన సేవలు ఎన్నటికి మరువలేమని ప్రధాని అన్నారు. ఆయన కుటుంబానికి, మిత్రులకు ట్విట్టర్ వేదికగా ప్రధాని సంతాపం ప్రకటించారు. కెప్టెన్ వరుణ్ సింగ్‌ను నిజమైన యోధునిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణిస్తూ తన చివరి క్షణం వరకు ఆయన పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని రాజ్‌నాథ్ తెలిపారు.