సినిమాలలో తాను పోషించిన వీరోచిత ఉదాత్త పాత్రలను జీర్ణించుకుని విజయకాంత్ 2005లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సినిమా ప్రపంచంలో ఆయనకు ధార్మికుడు, ధాతృత్వపరుడు అనే పేరుంది. డిఎంకె, అన్నాడిఎంకె పోటాపోటీ రాజకీయాలతో, తమ ముందుకు వచ్చే రగల్చే ద్రావిడ సెంటిమెంట్ల పార్టీల నేతల వరుసతో విసిగిన తమిళులు విజయకాంత్ పట్ల ఎంతో ఆశ పెంచుకున్నారు. ఆయనకు అపార ఫ్యాన్ బలం ఉండటంతో దీనిని ఆయన తన రాజకీయ సోపానంగా ఎంచుకున్నారు. ఆయన ఎంట్రీ బలీయంగా సాగింది. తెరపై కన్పించగానే ఉద్వేగం రెకెత్తించే నటుడిగా , ప్రత్యేకించి మాస్ హీరోగా ఆయన ఇమేజ్ తమిళనాడు రాజకీయాలలో ప్రముఖ స్థానానికి ఆయనను తీసుకువెళ్లింది. తమిళంలో వచ్చిన రమణ సినిమాలో అవినీతిపై పోరాడే పాత్రలో జవించిన విజయ్‌కాంత్ ఈ ఇమేజ్‌ను కొనసాగిస్తూ 2005 సెప్టెంబర్ 14న డిఎండికె స్థాపించారు. తమిళనాడులో ఈ పార్టీకి పలు అనుబంధ విభాగాలు వెలిశాయి. 2006 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీకి దాదాపు 9 శాతం ఓట్లు వచ్చాయి. అయితే కేవలం ఆయన ఒక్కడే గెలిచారు.
తరువాత పిఎంకెతో పొత్తు కుదుర్చుకున్నారు. సాధారణంగా నటులను దూరంగా ఉంచే పిఎంకె విజయ్ ఛరిష్మాను పరిగణనలోకి తీసుకుని ఆయనతో కలిసి సాగింది. తన కూటమి కేవలం ప్రజలతోనే అని తరచూ విజయ్‌కాంత్ చెప్పేవారు. తరువాతి లోక్‌సభ ఎన్నికలలో ఆయన పార్టీ ఓట్లశాతం తగ్గింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడిఎంకె తో సర్దుబాట్లకు దిగారు. ఈ ఎన్నికలలో ఆయన పార్టీకి 29 స్థానాలు దక్కాయి. దీనితో ఆయన 2011 నుంచి 2016 వరకూ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎనిమిది శాతం ఓట్లు దక్కించుకుని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ అయిన డిఎండికె ఈ దశలో డిఎంకె ప్రాబల్యానికి బ్రేక్ వేసింది తరువాత డిఎండికె అన్నాడిఎంకె పొత్తు ముగిసింది. 2014 సార్వత్రిక ఎన్నికల దశలో విజయకాంత్ బిజెపి కూటమితో కలిసి సాగారు. ఈ ఎన్నికలలో పిఎంకె, వైకో సారధ్యపు ఎండిఎంకె కూడా మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో విజయ్‌కాంత్ పార్టీ బలం గణనీయంగా పడిపోయింది. కేవలం 5 శాతం ఓట్లు వచ్చాయి. 2016 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కాంత్ పార్టీ మక్కల్ నల కూటాని (పీపుల్స్ వెల్ఫెర్ ఫ్రంట్)లో ప్రధాన పార్టీ అయింది. ఈ నాలుగు పార్టీల కూటమిలో వామపక్షాలు, విసికె కూడా భాగస్వామ్యపక్షాలు అయ్యాయి.
ఈ కూటమి ముందు రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలు డిఎంకె, అన్నాడిఎంకెకు సవాలు విసిరాయి. ఈ ఎన్నికలలో ఈ కూటమి పూర్తిగా దెబ్బతింది. చివరికి విజయ్‌కాంత్ ఉలుందురూపేట నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా కొల్పోయ్యారు. ఈ దశ నుంచి క్రమేపీ ఆయన రాజకీయ జీవితంపై మబ్బులు పర్చుకున్నాయి. వెండితెరపై రాణించడం తేలికే కానీ రాజకీయ జల్లికట్టు అంత ఈజీ కాదని విజయకాంత్ ఉదంతం తేల్చివేసింది.