డాగ్,బాంబ్ స్వాడ్ తనిఖీలు
హైదరాబాద్: నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం నాడు నానో కారు కలకలం రేపింది. బిజెపి కార్యాలయ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఉన్న కారులో బాంబ్ ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అబిడ్స్ పోలీసులు, డాగ్,బాంబ్ స్వాడ్‌లు బిజెపి కార్యాలయానికి చేరుకుని కారును పరిశీలించారు. ఈక్రమంలో కారులో ఉన్న సూట్ కేసును తనిఖీ చేయగా దుస్తులు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకుని నానో కారును అక్కడి నుంచి తరలించారు. వివరాల్లోకి వెళితే బిజెపి కార్యాలయం పార్కింగ్ స్థలంలో నానో కారు రెండు రోజులుగా పార్కింగ్ చేసి ఉంది. అనుమానంతో బిజెపి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే అబిడ్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులతో పాటు బాంబ్,డాగ్ స్వాడ్‌లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కారును పరిశీలించడంతో అందులో దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం కారు ఎవరిదన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు సదరు కారు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఉందని, ఆ కారు యజమాని ఫైజాన్‌గా గుర్తించారు. అయితే కారు యజమానినికి పోలీసులు విచారించడంతో తన ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో పార్టీ కార్యాలయం వద్ద కారును పార్క్ చేసినట్లు తెలిపారు.