Sunday, December 22, 2024

శుభకార్యానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు

- Advertisement -
- Advertisement -

బావిలో కారు పడి
నలుగురు మృతి
మహబూబాబాద్
జిల్లా కేసముద్రం
వద్ద ఘటన

నలుగురి మృతి.. మరో ముగ్గురు సురక్షితం
కేసముద్రం బైపాస్ రోడ్డులో బావిలో పడ్డ కారు

మన తెలంగాణ/కేసముద్రం : ఆ బావి వారి పాలిట మృత్యుశాపమైంది..శుభకార్యం వారింట అశుభానికి దారి తీసింది. ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బావిలో పడిపోగా నలుగురు మృతి చెందగా, ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. హృదయాలను కలిచివేసే ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం స్టేషన్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల శివారు గోల్యా తండాకు చెందిన కునుసోతు మధు అన్నారం షరీఫ్‌లో శుభకార్యం నిర్వహించారు. అదే తండాకు చెందిన బానోత్ భధ్రు (45), బానోత్ అచ్చాలి (35), మాలోత్ సుమలత, మాలోత్ దీక్షిత్‌లు శుభకార్యానికి హాజరై వస్తుండగా, మహబూబాబాద్ జిల్లా సురేష్‌నగర్ చెందిన మృతురాలు బానోత్ లలిత(55), ఆమె కుమారుడు బానోత్ సురేష్ (14)లు తాము కూడా వస్తామంటూ టిఎస్28ఎల్7299 ఎర్టిగా కారులో సాయంత్రం 4 గంటలకు అన్నారం షరీఫ్ నుండి బయలుదేరారు. కాగా కేసముద్రం బైపాస్ నుండి మహబూబాబాద్ మెయిన్‌రోడ్డుకు వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే బావిలోకి దూసుకెళ్ళింది.

కారు బావిలో పడిపోతుండగా స్థానిక వివేకానంద హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు సిద్ధు, రంజిత్‌లు ప్రాణాలకు తెగించి కారు అద్దాలు పగులగొట్టి మాలోత్ సుమలత, మాలోత్ దీక్షిత్, డ్రైవర్ గుగులోత్ బిక్కులను రక్షించారు. అనంతరం బావిలో కారు మునిగిపోగా కేసముద్రం ఎస్సై రమేష్‌బాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జెసిబి సహాయంతో కారును బావి నుండి రెండు గంటల పాటు శ్రమపడి బయటికి తీశారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ సదయ్య పరిశీలించారు. కారులో విగతజీవులుగా ఉన్న మృతులు బానోత్ భద్రు, ఆయన భార్య బానోత్ అచ్చాలి, మహబూబాబాద్‌కు చెందిన బానోత్ లలిత, ఆమె కుమారుడు బానోత్ సురేష్ మృతదేహాలను వెలికితీసారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు.

మహబూబాబాద్ వరకు వస్తాం.. మమ్మల్ని తీసుకెళ్లరా?

మహబూబాబాద్ సురేష్ నగర్‌కు చెందిన బానోత్ లలిత స్థానిక ఆంధ్రాబ్యాంకులో అటెండర్‌గా పని చేస్తున్నారు. అన్నారం షరీఫ్‌లో ఇదే శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో మేము కూడా మహబూబాబాద్ వరకు వస్తామంటూ కారెక్కారు. ఈ సంఘటనలో తల్లి, కొడుకులు ప్రాణాలు కోల్పోగా పలువురు కంట తడి పెట్టారు.

తల్లి, కొడుకు మృత్యుంజయులు

ప్రమాదంలో కారు బావిలో పడిపోతుండగా దానికి సమీపం లో ఉన్న వివేకానంద విద్యార్థులైన సిద్ధు, రంజిత్‌లు కారు అ ద్దాలు పగులకొట్టి మాలోత్ సుమలత, మాలోత్ దీక్షిత్, డ్రైవర్ గుగులోత్ బిక్కులను రక్షించి శభాష్ అనిపించుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News