మెదక్ జిల్లా, నర్సాపూర్బా-లానగర్ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటన జరిగిన స్థలంలోనే మృతిచెందగా, మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నర్సాపూర్ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు నల్లవల్లి అటవీ ప్రాంతంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను బలంగా ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి.
నర్సాపూర్ మండలం, రుస్తుంపేట గ్రామానికి చెందిన ఐశ్వర్యలక్ష్మి (20), నర్సాపూర్‌లో ఎఇగా పనిచేస్తున్న మనీషా (25), ఎల్లారెడ్డిగూడెంకు చెందిన ప్రవీణ్ (30) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా కౌడిపల్లికి చెందిన అనసూయ (62) మృతి చెందింది. ఈ ప్రమాదంలో గాయపడిన సంతోష్, రాజు, ప్రవీణ్, నవీన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ అతివేగం నలుగురి మృతికి కారణంగా తెలుస్తోంది. పోస్టుమార్టం జరుగుతున్న నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని సంఘటన స్థలాన్ని ఏఎస్‌పి సంజీవరావు, పటాన్ చెరువు డిఎస్‌పి రవీందర్ రెడ్డి, జిన్నారం సిఐ నయీముద్దీన్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.