ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన
నైనిటాల్: ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ధేలా నది పొంగి ప్రవహిస్తుండడంతో శుక్రవారం ఉదయం రాంనగర్ వద్ద వంతెనపైన ఒక కారు కొట్టుకుపోయి తొమ్మిదిమంది మరణించారు. తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ఎస్‌ఎస్‌పి పంకజ్ భట్ తెలిపారు. మృతులంతా పర్యాటకులని, వీరు పంజాబ్‌కు తిరిగివెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ సంఘటనలో కార్బెట్ కాలనీకి చెందిన నజియా అనే 22 ఏళ్ల వ్యక్తిని సజీవంగా కాపాడి రాంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. కారు రిజిస్ట్రేషన్ పంజాబ్‌కు చెందినది కావడంతో మృతులు పంజాబ్‌కు చెందిన వారిగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతులలో ఆరుగురు మహిళలు కాగా ముగ్గురు పురుషులని ఆయన చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై నది పొంగి ప్రవహిస్తోందని, నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయిందని ఎస్‌ఎస్‌పి తెలిపారు.