సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం గజ్వేల్ రింగు రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ, కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) భద్రతా సూపర్‌వైజర్‌తో పాటు మరొక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని గోదావరిఖనికి చెందిన ఎం లింగయ్య (25), ఎం బినేష్ (28)లుగా గుర్తించారు. మరో ఇద్దరు వ్యక్తులు.. రామగుండం నివాసి, ఎన్‌టిపిసిలో అగ్నిమాపక భద్రతా సూపర్‌వైజర్ ఎం మహేష్ (38), కరీంనగర్‌కు చెందిన కారు డ్రైవర్ కె ప్రణయ్ సాగర్ ఈ సంఘటనలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.