కేసముద్రం: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి పద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసముద్రం మాజీ జడ్పిటిసి వేం పురుషోత్తం రెడ్డి (68) మృతి చెందారు. శుక్రవారం ఉదయం తన స్వగ్రామమైన అర్పనపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పనులు జరుగుతుండగా వచ్చిన ఆయన మధ్యాహ్నాం వరంగల్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో గీసుగొండ మండలం గంగదేవిపల్లి వద్ద ఆర్టీసి బస్సును ఢీకొన్నట్లు తెలిసింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా ఆయన ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజిఎంకు తరలించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని హన్మకొండలోని ఆదాలత్‌లో ఆయన నివాసానికి తరలించారు. పురుషోత్తం రెడ్డి మరణ వార్తతో ఆయన స్వగ్రామం అర్పనపల్లిలో, మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కేసముద్రం మండల జడ్పిటిసిగా 1995 సంవత్సరంలో ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన మహబూబూబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత టిపిసిసి ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డికి స్వయాన సోదరుడు. 1991 నుండి 1996 వరకు అర్పనపల్లి గ్రామ సర్పంచ్‌గా సేవలందించిన ఆయన ఉత్తమ గ్రామపంచాయితీ అవార్డును అందుకున్నారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీకి గతంలో వైస్ చైర్మెన్‌గాను పని చేశారు. ఆయనకు భార్య ఉమ, కుమారులు చేతన్, చరణ్ ఉన్నారు.