సిద్దిపేట: కారు నీటి ప్రవాహంలో ఇరుక్కున్న సంఘటన సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ కాలనీవాసులు కూడవెల్లి సంతోష్, మురం భాను ఇరువురు కలసి సిద్దిపేట నుండి వరంగల్ కు కారులో వెళ్తుండగా బస్వాపూర్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున మిట్టపల్లి- కొత్తపల్లి గ్రామాల నుండి వెళ్లారు. మిట్టపల్లి గ్రామ శివారులో కల్వర్టు వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున పవాహంలోకి కారుతో వెళ్లారు. నీటి ప్రవాహంలో కారు ఆగిపోయింది. స్థానికుల సమాచారం మేరకు త్రీ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే టోయింగ్ వాహనాన్ని తెప్పించి నీటి ఉధృతి లో తట్టుకున్న కారును సురక్షితంగా బయటకు తీశారు. వరద ఉధృతి నుంచి వాహనాలు వెళ్లకుండా చెట్ల కొమ్మలను, ముళ్ళ పొదలను అడ్డుగా పోలీసులు వేశారు.
ఈ సందర్భంగా సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో ఉన్న కల్వర్టు పై నుండి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలు, వాహనదారులు ఎవరు కూడా నడుచుకుంటు, వాహనాలతో వరద ప్రవాహాన్ని దాటే ప్రయత్నం చేయవద్దని పోలీసులు సూచించారు.