కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించిన సంఘటన హుమాయున్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్‌నగర్ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… కర్నాటక రాష్ట్రం రిజిస్ట్రేషన్‌తో ఉన్న థార్ వాహనం వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న బైక్‌లు, ఆటోను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోకు డ్యామెజ్ అయ్యింది. ప్రమాదం జరగగానే కారులో ఉన్న ఇద్దరు కిందకి దిగి పరారయ్యారు.
థార్ కారును మహిళ డ్రైవింగ్ చేసిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం థార్ వాహనాన్ని సీజ్ చేశారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు వాహనానికి సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, కారు నడిపిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని హుమాయున్‌నగర్ పోలీసులు తెలిపారు.