Sunday, January 19, 2025

అబద్ధాలకు కేరాఫ్ ఆ బిజెపి నలుగురు ఎంపిలు

- Advertisement -
- Advertisement -

Carafe for lies that four BJP MPs: Satyavathi Rathod

కెసిఆర్ సారథ్యంలో కేంద్ర మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నాం
సోయి లేకుండా మాట్లాడుతుండు.. సిఎంను విమర్శించే స్థాయి బండికి లేదు
మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్

మహబూబాబాద్ : రాష్ట్రం నుంచి బిజెపి ఎంపిలుగా ఉన్న ఆ నలుగురు తెలంగాణ బిడ్డలైతే.. వారిలో ప్రవహించేది తెలంగాణ రక్తమైతే.. తెలంగాణ ఆత్మగౌరవం, పౌరుషం వారిలో ఉంటే కేంద్రం మోచేతి నీళ్లు తాగడం, ఎంగిలి కూడు తినడంమాని రాష్ట్ర ప్రయోజనాలకోసం పాటుపడాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. బిజెపి అంటేనే ఝూటా పార్టీగా అభివర్ణించారు. ఆదివారం జిల్లాలోని వివిధ మండలాల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా నర్సింహులపేట మండలం పెద్దనాగారం గ్రామంలో పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బిజెపిపైనా, ఆ పార్టీ ఎంపిలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అబద్ధాలకు మారుపేరుగా బిజెపి మారిందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి గడచిన ఎనిమిది ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి చేసింది శున్యమని, పైగా నిత్యం రాష్ట్రంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో దేశంలో అఖరున ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గత ఎనిమిదేళ్లుగా అన్నిరంగాల్లోనూ అగ్రగామిగా నిలించిందన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, వివిధ ప్రాంతాల్లోని వెనుకబాటుతనం గురించి తెలిసిన నాయకుడు కెసిఆర్ మాత్రమేనని, ఆయనే ఈ రాష్ట్రానికి సిఎం కావడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. అబద్దపు మాటలు చెప్పి బిజెపి ఎంపిలు నలుగురు గెలిచి.. ఇప్పుడు మిడిసిపడుతున్నారన్నారు. ఇదిలాగే కొనసాగితే చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. బండి సంజయ్ బిజెపి జాతీయ అధ్యక్షుడా.. తెలంగాణ అధ్యక్షుడన్న సోయిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. సంజయ్ నువ్వు ఎక్కడున్నావో నీకు తెలుస్తలేదు.. కెసిఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పడు లాగు కూడా తొడుక్కోలేదు. తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించి, ప్రగతిపథంలో నడిపిస్తున్న సిఎం కెసిఆర్‌ను విమర్శించే స్థాయి బండికి ఉందా అని దెప్పిపొడిచారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఇక్కడి పేదోళ్ల కోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో ఏపాటి పాత్ర పోషించారో చెప్పాలని నిలదీశారు.

పసుపు బోర్డు తెస్తాననిచెప్పి బాండ్ పేపర్ రాసి ఎంపి అయిన అర్వింద్ చేసిందేమిటన్నారు. సోయం బాబురావు గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు వారికి దూరంగా తిరుగుతున్నాడని విమర్శించారు. బిజెపి నేతలకు తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. ఈ సంగ్రామ యాత్రను ఢిల్లీ పెద్దల మీద.. కేంద్రం మీద చేయాలని మంత్రి సత్యవతి డిమాండ్ చేశారు. చేయాల్సింది పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, పౌరుషం, రక్తం వీరిలో ప్రవహిస్తుంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాలి కానీ, రాష్ట్రానికి అన్యాయం చేసే బిజెపి ప్రయోజనాల కోసం వారి మోచేతి నీళ్లు తాగడానికి, ఎంగిలి మెతుకులు తినడానికి ప్రయత్నం చేయవద్దన్నారు. తెలంగాణ ప్రజలను అన్నివిధాలుగా కాపాడేందుకు సిఎం కెసిఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. సమావేశంలో పార్టీ నేతలు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కొమ్మినేని రవీందర్, రామ్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News