Sunday, January 12, 2025

మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పు

- Advertisement -
- Advertisement -

కర్బన ఉద్గారాలు.. ఎన్నో అనర్థాలకు హేతువుగా నిలిచిన వీటి మాట వింటే చాలు వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఏర్పడింది. భూతాపం పెరిగిపోవడానికి, వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి ప్రధాన కారణం వాతావరణంలోకి వెలువడుతున్న ఈ కర్బన ఉద్గారాలే. మానవ చర్యల కారణంగా కర్బన ఉద్గారాలు విపరీతంగా వెలువడుతూ వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. అడవుల నరికివేత, గనుల తవ్వకం, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, ఉక్కు, సిమెంట్ కర్మాగారాలు, వంటచెరకు వినియోగం..

ఇవన్నీ కర్బన ఉద్గారాలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ కర్బన ఉద్గారాల కారణంగా భూమి పొడిబారుతోందంటూ వెలువడిన ఓ తాజా అధ్యయనం.. మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పును కళ్లకు కడుతోంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో రెండు రోజుల క్రితం ఎడారీకరణ నిరోధానికి తీసుకోవలసిన చర్యలపై జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సు (యుఎన్ సిసిడి) ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. గత 30 ఏళ్లలో 77 శాతం భూమి పొడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొందని, భూగోళంపై పొడి నేలల సంఖ్య 43 లక్షల చదరపు కిలోమీటర్లు పెరిగిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇది మొత్తం భూభాగంలో 40 శాతం పైమాటే. కర్బన ఉద్గారాల విడుదలను అరికట్టకపోతే పెద్దయెత్తున భూములు పొడిబారిపోతాయంటూ హెచ్చరించింది. ఆసియా, మధ్య ఆసియా, పశ్చిమ అమెరికా, బ్రెజిల్, యూరప్‌లోని ప్రాంతాలకు ఎడారీకరణ ముప్పు పొంచి ఉందంటూ చేసిన హెచ్చరిక కలవరం కలిగించేదే.

కర్బన ఉద్గారాల కారణంగా పొడిబారి, ఎడారీకరణకు గురవుతున్న నేలల్లో నివసించే వారి సంఖ్య ఇప్పటికే 230 కోట్లకు చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 నాటికి బాధిత జనాభా సంఖ్య 500 కోట్లకు చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే దక్షిణ సూడాన్, టాంజానియా దేశాలు పొడిబారిన నేలల వల్ల తలెత్తే దుష్పరిణామాలకు లోనవుతున్నాయి. కరవుకు గురైన ప్రాంతాలలో వర్షం పడితే అక్కడి నేలలు మళ్లీ సారవంతం కావచ్చు. కానీ పొడి వాతావరణం భూములను కబళిస్తే అవి సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదని సదరు సదస్సు హెచ్చరించిన నేపథ్యంలో కర్బన ఉద్గారాల విడుదలకు ప్రపంచ దేశాలు తక్షణమే నడుం బిగించవలసి ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించడం ద్వారా భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్ కే పరిమితం చేయాలని ప్రపంచ దేశాలు చాలా ఏళ్ల క్రితమే పారిస్ ఒప్పందం ద్వారా ప్రతినబూనాయి. కానీ ఈ లక్ష్యసాధన దిశగా చేస్తున్న కృషి మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, ఈ శతాబ్దాంతానికి భూతాపం 3.1 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరిగే ప్రమాదం గోచరిస్తోంది. కర్బన కాలుష్యం పెచ్చుమీరడానికి ధనిక దేశాలే కారణం. వీటిలో చైనా, అమెరికా, ఇండియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇండియా విషయానికొస్తే, శిలాజ ఇంధనాల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్న కారణంగా 48 శాతం మేరకు కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. దీనికి పరిష్కారం సౌర, పవన విద్యుత్ వైపు మొగ్గు చూపడమే. మన దేశం ఈ దిశగా ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తోంది. మరో ఆరేళ్లలో కర్బన ఉద్గారాలను 45 మేరకు తగ్గించుకోవడం, శిలాజేతర ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవడం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

వాతావరణ కాలుష్యం పెచ్చుమీరుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు శాస్త్రవేత్తల సహకారంతో ముందడుగు వేయవలసిన అవసరం ఉంది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని అరికట్టేందుకు జీవ ఇంధనాలవైపు దృష్టి సారించడం మన ముందున్న ఓ పరిష్కార మార్గం. ఇంధన వినియోగంలో హైడ్రోజన్ వాటా పెంచడం మరో పరిష్కారం. అలాగే గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి, భూగర్భంలో నిక్షిప్తం చేసేందుకు శాస్త్రవేత్తలు పేర్కొంటున్న ‘కార్బన్ కాప్చర్, స్టోరేజీ’ పరిజ్ఞానాన్ని కూడా ప్రభుత్వాలు పరిశీలించాలి. ఎడారీకరణతో తలెత్తే అనర్థాలను ఐక్యరాజ్య సమితి సదస్సు విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇకనైనా కళ్లు తెరవాలి. పారిస్ ఒప్పందం మాదిరిగా ఏమీ పట్టనట్లు కూర్చుంటే భావి తరాలవారి భవిష్యత్తును కాలరాసినవాళ్లమే అవుతాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News