Wednesday, January 22, 2025

పతంగులతో పదిలం

- Advertisement -
- Advertisement -

భారత దేశం ఎన్నో ఆటలకు, క్రీడలకు పుట్టినిల్లు. కబడ్డీ, హాకీ, క్రికెట్, ఫూట్‌బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్, పరుగు పందెం, పోలో లాంటి ఆటలు క్రీడ స్థలంలో కానీ మైదానంలో ఆడుతూ ఉంటారు. ఈత లాంటివి నీటిలో, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్, చదరంగం, వైకుంఠపాళీ, అష్టాచమ్మ లాంటివి ఒక గదిలో ఆడుతుంటారు. కానీ ఒక వ్యక్తి భూమిపై ఉంటూ ఆకాశం వైపు చూస్తూ ఆకాశంలో గాలి పటాలు ఎగురవేస్తూ పందాలు కాయడం ప్రత్యేకత సంతరించుకుంది. మకర సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్దలు, పిల్లలు గాలి పటాలు నగరాల్లో, పల్లెల్లో ఎగురవేస్తుంటారు. పురాణాల్లో చూస్తే త్రేతాయుగంలో శ్రీరాముడు తన సోదరులతో హనుమంతుని తో పాటు గాలి పటాలు ఎగురవేశారని తెలుస్తుంది. చరిత్ర చూస్తే క్రీ.శ 206 సంవత్సరంలో దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు హేన్ చక్రవర్తి రాజు కోటను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కోటకు సొరంగ మార్గం తవ్వేందుకు దూరం కొలవడానికి కోటపైకి గాలిపటం దానికి దారం కట్టి ఎగుర వేసి దారం ఎంత పొడవు వుందో అంతే పొడవు సొరంగం త్రవ్వి కోటను స్వాధీనపరచుకున్నాడు.

గాలి పటంపై తెలుగులోనూ, హిందీలోనూ సినిమాలు, పాటలు కూడా వచ్చాయి. వాటిలో కృష్ణ, విజయనిర్మల, ఎస్.వి.రంగారావు నటించిన ‘గాలి పటాలు, హిందీలో రాజేంద్ర కుమార్, మాల సిన్హా నటించిన ‘పతంగ్’, రాజేష్ ఖన్నా, ఆశా పరేఖ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కటి పతంగ్’, సినిమా పాటల్లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘తోడి కోడళ్లు’లో గాలిపటం గాలిపటం రంగులగాలి పటం అనే పాట, రామ్ రహీంలో చిత్రంలో చంద్రమోహన్, రోజా రమణిల పాట ఎగిరే గాలి పటానికి దారం ఆధారం అనే పాట , రాజేంద్రప్రసాద్ నటించిన స్నేహం చిత్రంలో ఎగిరేసే గాలి పటాలు, దొంగాట దాగుడు మూతలు పాటలు అప్పుడప్పుడు వింటూ ఉంటాము. హిందీ సినిమా పాటలు చూస్తే కటి పతంగ్‌లో సినిమాలోని నా కోహి ఉమంగ్ హై; నా కోహి తరంగ్ హై, మేరీ జిందగి ఏక్ కటి పతంగ్, భాభి చిత్రంలోని చలి చలి రే పతంగ్, లతా మంగేష్కర్, రఫీ పాడిన కోఠె పే పతంగ్ ఉడితి లాంటి పాటలు హిట్ పాటలుగా నిలిచాయి.

గాలి పటాలను హిందీలో పతంగ్ అని అర్థం. గాలి పటాలు భారత దేశంలో కాక చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లాంటి దేశాల్లో ఎగుర వేస్తుంటారు. గుజరాత్ ప్రజలు సంక్రాంతి పండుగ సమయాల్లో కైట్ ఫెస్టివల్ నిర్వహించి భారీ సంఖ్యలో పాల్గొనడం ప్రపంచ ప్రసిద్ధి. ఈ గాలి పటాలు ఎగుర వేసేటప్పుడు నిలబడి ఆకాశం వైపు చూడటం వలన కంటి చూపు పెరుగుతాయని, శరీర కండరాలకు మంచి వ్యాయాయం చేకూరుస్తుందని అంటారు. చలి కాలంలో పగటి పూట ఎండలో నిలబడి గాలి పటాలు ఎగుర వేస్తే దేహానికి సూర్యరశ్మి తగిలి మన శరీరంలోని బ్యాక్టీరియా నశించి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటుంది. ఈ గాలి పటాలు ఎగురవేయడంలో వినోదంతో పాటు విషాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎత్తైన భవనాల మీద, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, సెల్ ఫోన్ టవర్స్ వద్ద నుంచి గాలి పటాలు ఎగురవేస్తే భవనాలపై నుంచి క్రింద పడటం, విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంది. పతంగులకు దారం తెగకుండా ఉండేందుకు బియ్యం, చెట్ల జిగురు, చిగుళ్ళతో ప్రకృతి సిద్ధమైన మాంజా అనే పూత పూసేవారు.

కానీ నేడు చైనా మాంజా పేరుతో గాజు పొడి, అల్యూమినియం ఆక్సైడ్, జిర్కొనియం లాంటి పదార్థాలు వాడటం వలన దారం గట్టిగా ఉండి ఎదుటి వారి పతంగులను కోసివేస్తుంది. ఈ చైనా మాంజా దారం గాలిలో ఎగిరే పక్షులకు తగిలి చనిపోతున్నాయి. ఒక్కొక్కసారి రహదారుల వెంట నడిచే వారికి, ద్విచక్ర వాహనదారుల మెడకు చుట్టుకొని ప్రాణాలు తీస్తున్నాయి. ప్రాణాంతక చైనా మాంజా పేరుకు మాత్రమే చైనా మాంజా, ఇది చైనా నుంచి దిగుమతి కాదు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో తయారు చేసి హైద్రాబాద్ పాత నగరంలో విక్రయించబడుతున్నాయి. కావున ఇలాంటి చైనా మాంజాలు వాడకుండా ప్రభుత్వ అధికారులు కఠిన ఉత్తర్వులు జారీ చేసి నిషేధం అమలు పరుస్తూ ప్రజలను, మూగ పక్షులను రక్షించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News