‘తాండవ్’ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను అవమానించారని ఆరోపణ
లఖ్నో: ‘తాండవ్’ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను అవమానకరంగా చూపించారంటూ అమేజాన్ ఇండియా చీఫ్ అపర్ణా పురోహిత్‌పై లఖ్నోలో కేసు నమోదైంది. ఆదివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి తమకు ఫిర్యాదు చేశారని హజ్రత్‌గంజ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ అమర్‌నాథ్‌యాదవ్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో తాండవ్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అలీ అబ్బాస్, నిర్మాత హిమాన్షుకృష్ణమెహ్రా, రచయిత గౌరవ్ సోలంకీ పేర్లు కూడా ఉన్నాయి. శుక్రవారం ప్రసారమైన మొదటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ నటులు సైఫ్‌అలీఖాన్, డింపుల్‌కపాడియా,సునీల్‌గ్రోవర్ కూడా ఉన్నారు. మొదటి ఎపిసోడ్ 17వ నిమిషంలో హిందూ దేవుళ్లు, దేవతలను అవమానకరరీతిలో చూపించారని, మతపరమైన భావోద్వేగాలను గాయపరిచే భాష ఉపయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ముంబయి నార్త్‌ఈస్ట్ ఎంపి మనోజ్ కోటక్(బిజెపి) ఇప్పటికే కేంద్ర సమాచారశాఖకు లేఖ కూడా రాశారు. అమేజాన్ ప్రైమ్ వీడియో నిర్వాహకుల్ని దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు కేంద్ర సమాచారశాఖ అధికారి ఒకరు తెలిపారు.