బలవంతంగా షాపును మూసివేయించిన కళ్యాణ్
మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాద్ : షాపును బలవంతంగా మూసివేసిన కేసులో సినీ నిర్మాత చిల్లర కళ్యాణ్, మరో ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ స్వరూప్ 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ నుంచి 634 గజాల భూమిని కొనుగోలు చేశాడు. అనంతరం ఆ స్థలాన్ని తన సోదరుడు గోపీకృష్ణ పేరుతో జిపిఏ చేశారు. ఈ స్థలాన్ని 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. ఆయన అందులో ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. సినీ నిర్మాత కళ్యాణ్ తమను పంపించాడని శ్రీకాంత్, తేజస్వి, షరూఫ్ అనే ముగ్గురు వ్యక్తులు సోమవారం సాయంత్రం వచ్చి షాపును బలవంతంగా మూసివేసి తాళం వేశారు. తాము సినీ నిర్మాత కళ్యాణ్ ఆదేశాల మేరకు తాళాలు వేసినట్లు స్పష్టం చేశారు. బాధితుడు గోపికృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేసి నలుగురిపై కేసులు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.