మహిళ తలపై ఉమ్మి వేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
న్యూఢిల్లీ: హెయిర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్‌పై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జావెద్ అబీబ్ ఓ మహిళకు జుట్టు కత్తిరిస్తూ తలపై ఉమ్మి వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై కేసు నమోదైంది. జావెద్ తన బృందంతో కలిసి జనవరి 3న ముజఫర్‌నగర్‌లో సెమినార్ నిర్వహించారు. అందులో భాగంగా ఓ మహిళకు జుట్టు కత్తిరిస్తూ మెలకువలు చెబుతున్నారు. ‘ఓవేళ నీళ్లకు కొరత ఉంటే ఉమ్మిని వినియోగించవచ్చునని’ చెబుతూ మహిళ నెత్తిమీద ఉమ్మేశారు. తనకు జరిగిన అవమానంపై బాధితురాలు పూజాగుప్తా ముజఫర్‌నగర్‌లోని మన్సూర్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దాంతో, వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం, అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించడంలాంటి పలు సెక్షన్ల కింద జావెద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. సంఘటనపై దర్యాప్తు జరిపి నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టానలి యుపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. జావెద్‌కు కూడా కమిషన్ నోటీస్ జారీ చేసింది. జనవరి 11న కమిషన్ ముందు హాజరై జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు జావెద్ కూడా క్షమాపణ చెప్పారు. వర్క్‌షాపుల్లో ఇలాంటి హాస్యభరిత సన్నివేశాలు ఉంటాయని, ఇది ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలంటూ జావెద్ విచారం వ్యక్తం చేశారు.