బెంగళూరు: ప్రస్తుతం రద్దయిన ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా ముడుపులు పొందారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతరులపై జనాధికారా సంఘర్షణ సంఘటనే తరఫున ఆదర్శ్ అయ్యర్ కేసు పెట్టారు. దాంతో ఎప్ఐఆర్ నమోదు చేయమని బెంగళూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు (the Special Court for People’s Representatives in Bengaluru) ఈ విషయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో పోలీసులు నిర్మలా సీతారామన్, తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సుప్రీం కోర్టు ఫిబ్రవరిలో ఎన్నికల బాండ్ల స్కీమ్ ను రాజ్యాంగ విరుద్ధం అంటూ కొట్టేసింది. పైగా అది పౌరుల సమాచార హక్కును ఉల్లంఘించేదిగా ఉందని పేర్కొంది. రాజకీయ పార్టీలకు నగదు విరాళాలు ఇచే స్థానంలో ఈ ఎలెక్టోరల్ బాండ్స్ స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా పారదర్శకతను తీసుకురాడానికి ఇలా చేసింది.
ఈ కేసు విషయంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా స్పందించారు. ఆయన నిర్మలా సీతారామన్ రాజీనామాను కూడా డిమాండ్ చేశారు. మూడు నెలల్లో ఆమె తన రాజీనామా సమర్పించాలన్నారు. ‘‘ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నిర్మలా సీతారామన్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆమె ఎవరు? ఆమె కేంద్ర మంత్రి. ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వారు వసూళ్లకు పాల్పడ్డారు. ఆ విషయంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదయింది. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఆమె తన రాజీనామాను సమర్పించాలి. వారు(బిజెపి) ఆమె రాజీనామాను కోరగలరా?’’ అని సిద్దరామయ్య అన్నారు. ఆయన ఇంకా ‘‘ ఇప్పుడు సెక్షన్ 17ఏ (అవినీతి నిరోధక చట్టం) కింద పరిశోధన జరిపి మూడు నెలల్లో నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. దాని ప్రకారం వారు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. తదుపరి పరిశోధన మొదలెట్టారు’’ అన్నారు. ‘‘ నా కేసులో, కింది కోర్టు ఉత్తర్వు జారీచేసింది. సెక్షన్ 17ఏ కింద గవర్నర్ విచారణ కోరారు. పరిశోధన జరిపి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది’’ అని సిద్దరామయ్య వివరించారు.
‘ముడా’(MUDA) కేసులో సిద్దరామయ్య మీద కూడా విచారణ జరిగింది. కాగా సిద్దరామయ్య కూడా కేంద్ర మంత్రి హెచ్ డి. కుమార స్వామి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయనపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘ ముందు కుమారస్వామి రాజీనామా చేయాలి. ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఆయన రాజీనామా కూడా చేయాలి. ఎలెక్షన్ బాండ్ల కేసులో ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలి’’ అన్నారు.