Tuesday, September 17, 2024

ఎసిపి భుజంగరావుపై కేసు

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన ఎసిపి భుజంగరావుపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్‌పల్లిలోని సర్వే నంబర్ 1007లోని 340 ఎకరాల ఆస్తికి సంబంధించిన నకిలీ డాక్యుమెంట్ల తయారీలో సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో భుజంగరావుపై కేసు నమోదు చేశారు. భూమి యజమాని నవాబ్ మీర్ హషీం అలీ ఖాన్‌కు తన తాత నవాబ్ రేయాస్ యార్ జంగ్ నుంచి వారసత్వంగా వచ్చిన కూకట్‌పల్లిలోని 350 ఎకరాలను 1952లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. నవాబ్ రేయాస్ యార్ జంగ్ 1960లో మృతిచెందడంతో హసీం అలీఖాన్ భూమిని స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుంచి పొజిషల్‌లో ఆయనే ఉన్నాడు. ఈ క్రమంలోనే భూమిపై కన్నెసిన నిందితులు ఎస్‌ఎస్ మోయినుద్దిన్, ప్రైమ్ ప్రాపర్టీస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గ్రీన్‌కో కంపెనీ డైరెక్టర్ చలమలషెట్టి అనిల్ నకిలీ పత్రాలను తయారు చేసి భూమి తమదిగా స్వాధీనం చేసుకున్నారు. దీంతో హషీం అలీఖాన్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో 2014లో కేసు పెట్టాడు.

ఈ సమయంలోనే కూకట్‌పల్లి ఎసిపిగా పనిచేసిన భుజంగరావు నిందితులకు సహకరించాడు. ఫోర్జరీ డాక్యుమెంట్లను అసలు పత్రాలుగా చెప్పి కేసు వాపస్ తీసుకోవాల్సిందిగా భూమి యజమానిపై ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా భూమి యజమానిని అరెస్టు చేయాల్సిందిగా దర్యాప్తు అధికారిని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన హసీం అలీఖాన్ అక్కడి నుంచి వెళ్లిపోయి, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే మీర్ హషీం అలీ కుమారుడు మీర్ అబ్బాస్ అలీఖాన్ తన తండ్రికి వారసత్వంగా వచ్చిన భూమిని కొట్టేసేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని నిందితులపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతికి ఫిర్యాదు చేశారు. సిపి అవినాష్ మహంతి కేసును ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన అధికారులు ఎసిపి భుజంగరావు, అనిల్, శ్రీనివాస రావు, ఎస్‌ఎస్ మోయినుద్దిన్‌పై కేసు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News