Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు.. 

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బిఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు సంగారెడ్డి ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఇపి కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల సంగా రెడ్డిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తన పేరు తీస్తే గుడ్డలూడదీసి కొడతానంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలనునుద్దేశించి కామెంట్ చేశారు.

సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో పండబెట్టి తొక్కుతానంటూ హెచ్చరించారు. ఎన్నికలయ్యేంత వరకు రఘునందన్ అనే పేరు తీయొద్దంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పోలీసులకు సంగారెడ్డి ఎంఎల్‌ఎ చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి రఘునందన్ రావు పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి నీలం మధు ముదిరాజ్, బిఆర్‌ఎస్ నుంచి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.

హరీశ్ రావుపై మళ్లీ విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కెసిఆర్ మొదటి ముద్దాయిగా, హరీశ్‌రావును రెండో ముద్దాయిగా చేర్చాలంటూ మెదక్ బిజెపి ఎంపి అభ్యర్థి రఘునందన రావు డిమాండ్ చేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన బిఆర్‌ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్‌లో దేవుడిని కూడా వదిలిపెట్టలేదన్నారు. యాదగిరి గుట్ట దేవాలయాన్ని కట్టడానికి బంగారం దుకాణదారులను భయపెట్టినట్లు అనిపిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అండర్ స్టాండింగ్‌తో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో మొదటి ముద్దాయి కెసిఆర్, రెండో ముద్దాయి హరీశ్ రావు, మూడో ముద్దాయిగా వెంకట రామిరెడ్డి, నాలుగో ముద్దాయిగా కెటిఆర్ పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో మూడున్నర కోట్లు పట్టుకున్నా, రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని ప్రశ్నించారు.

వివేక్ వెంకటస్వామి కూడా బాధితుడే కదా, మరి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని అడిగారు. ఎంఎల్‌సి వెంకట రామిరెడ్డిని కొత్త వియ్యంకుడు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కాపాడుతున్నారా? అని ప్రశ్నించారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు స్పందిం చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో స్టీఫెన్ రవీంద్ర చెప్పిన రూ.30 కోట్లు ఎక్కడికి పోయాయన్న ఆయన, రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారాన్ని పక్కన పెట్టి, మునుగోడు, దుబ్బాక ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News