Wednesday, January 22, 2025

ఎమర్జెన్సీలో పార్లమెంట్ చేసిందంతా చెల్లదని అనలేం: సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగం పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలపై కేసు
25న తీర్పు వెలువరిస్తామన్న కోర్టు

న్యూఢిల్లీ : రాజ్యాంగం పీఠికకు ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, ‘ఇంటెగ్రిటీ’ (సమగ్రత) పదాలను చేరుస్తూ రాజ్యాంగానికి 1976లో చేసిన సవరణపై న్యాయ సమీక్షలు జరిగాయని, ఆత్యయిక స్థితి కాలంలో పార్లమెంట్ చేసినదంతా చెల్లదని అనజాలమని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. రాజ్యాంగం పీఠికకు ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’ పదాల చేర్పును సవాల్ చేస్తూ రాజ్యసభ మాజీ ఎంపి సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది విష్ణు శంకర్ జైన్, తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై తమ తీర్పును ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం రిజర్వ్ చేసింది. అయితే, ‘సదరు సవరణ (42వ సవరణ)ను ఈ కోర్టు పలు న్యాయ సమీక్షలకు లోను చేసింది. పార్లమెంట్ జోక్యం చేసుకున్నది. ఆ సమయం (ఎమర్జన్సీ)లో పార్లమెంట్ చేసినదంతాచెల్లదని అనజాలం’ అని సిజెఐ తెలిపారు.

1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రతిపాదించిన 42వ రాజ్యాంగ సవరణ కింద రాజ్యాంగం పీఠికలోకి ‘సోషలిస్ట్’, ‘సెక్యులర్’, సమగ్రత పదాలను చేర్చారు. ఆ సవరణ పీఠికలోని భారత్ వివరణను ‘సర్వసత్తాక, ప్రజాస్వామ్య రిపబ్లిక్’ నుంచి ‘సర్వసత్తాక, సోషలిస్ట్, సెక్యులర్, ప్రజాస్వామ్య రిపబ్లిక్’గా మార్చింది. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 31 వరకు దేశంలో ఎమర్జన్సీ విధించారు. ఈ అంశంపై తమ తీర్పును ఈ నెల 25న వెలువరిస్తామని బెంచ్ ప్రకటించింది. పిటిషనర్ కోరినట్లుగా ఈ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించేందుకు బెంచ్ విచారణ సమయంలో నిరాకరించింద. భారతీయ దృక్పథంలో ‘సోషలిస్ట్’ను ‘సంక్షేమ రాజ్యం’గా అర్థం చేసుకోవాలని బెంచ్ సూచించింది.

సర్వోన్నత న్యాయస్థానం మాజీ న్యాయమూర్తులు విఆర్ కృష్ణయ్యర్, ఒ చిన్నప్ప రెడ్డి ప్రతిపాదించినట్లుగా ‘సోషలిస్ట్’ పదం అన్వయం పట్ల మెజారిటీ సభ్యులు సందేహం వ్యక్తం చేసినట్లు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇటీవలి తీర్పులో పేర్కొన్నదని న్యాయవాది జైన్ తెలిపారు. ‘భారత్‌లో మనం అర్థం చేసుకునే సోషలిజం ఇతర దేశాలకు చాలా భిన్నమైనది. మన దృష్టిలో ప్రధానంగా సోషలిజం అంటే సంక్షేమ రాజ్యం. అంతే. అది ప్రైవేట్ రంగాన్ని ఎన్నడూ నిరోధించలేదు. ప్రైవేట్ రంగం పరిఢవిల్లుతోంది. మనం అంతా దాని నుంచి లబ్ధి పొందాం’ అని అప్పట్లో బెంచ్ చెప్పింది. సోషలిజం పదాన్ని ప్రపంచవ్యాప్తంగా భిన్న సందర్భాల్లో వాడుతుంటారని, భారత్‌లో దాని అర్థం సంక్షేమ రాజ్యం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలన్నది, సమాన అవకాశాలు కల్పించాలన్నది అని జస్టిస్ ఖన్నా అన్నారు. 1994 ఎస్‌ఆర్ బొమ్మై కేసులో రాజ్యాంగం మౌలిక వ్యవస్థలో అంతర్భాగంగా ‘సెక్యులరిజాన్ని’ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నదని జస్టిస్ ఖన్నా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News