హైదరాబాద్ : గోషామహల్ బిజెపి ఎంఎల్‌ఎ టి రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన మహారాజ్‌గంజ్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో రాజా సింగ్ విద్వేష ప్రసంగం చేశారని కేసు నమోదైంది. మంగళ్‌హాట్ పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. రాజా సింగ్‌పై సుమో టో యాక్షన్ తీసుకుంటూ మంగళ్‌హాట్ పోలీసులు ఆర్‌పి యాక్ట్ కింద సెక్షన్లు 125 కింద బుధవారం కేసు నమోదైంది. రాజాసింగ్ మహారాజ్‌గంజ్‌లోని అగర్వల్ భవన్‌లో విద్వేష ప్రసంగం చేసినట్టు మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్ ఎస్‌ఐ షేక్ అస్లాం ఫిర్యాదు చేశారు.
ముస్లింలను టార్గెట్ చేసుకుంటూ బిజెపి నేత టి రాజాసింగ్ హిందీలో ప్రసంగించారనే క్యాప్షన్‌తో 51 సెకండ్ల వీడియో ఒకటి బయటకు వచ్చిందని ఎస్‌ఐ వెల్లడించారు. ఆ వీడియోలో ఎంఎల్‌ఎ మాటలు ఇలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘చూడండి మన పోరాటం జిహాదీ వర్సెస్ హిందూ బిడ్డలది. ఈ పోరాటం ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్నది. గోషామహల్ అసెంబ్లీ స్థానం పేరు కేవలం తెలంగాణ, భారత్‌లోనే కాదు. మొత్తం విశ్వానికే తెలుసు. ఈ విధాన సభలో రాజా సింగ్ అనే పేరుతో ఒక చిన్న హిందూ కరసేవకుడు ఉంటాడని, లవ్ జిహాద్ ఘటనలకు మూతి పగలగొట్టే సమాధానం చెబుతూ ఉంటాడని మొత్తం విశ్వానికి తెలుసు. ఎవరో ఒకరైతే ఉన్నారు కదా అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు