ఏ2గా విక్టరీ వెంకటేశ్
మన తెలంగాణ/హైదరాబాద్ : డెక్కన్ కిచెన్ హోటల్ వివాదంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబంపై కేసు నమోదైంది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్ లో విక్టరీ వెంకటేశ్ ను ఎ2గా పేర్కొన్నారు. నందకుమార్ అనే వ్యక్తికి, దగ్గుబాటి కుటుంబానికి డెక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. 2022లో జిహెచ్‌ఎంసి సిబ్బంది, బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి కుటుంబం ఈ హోటల్ ను కొంతమేర ధ్వంసం చేసింది. నందకుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ గతేడాది జనవరిలో దగ్గుబాటి ఫ్యామిలీ ఆ హోటల్ ను పూర్తిగా నేలమట్టం చేసింది. దాంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. శనివారం నందకుమార్ పిటిషన్‌ను విచారించిన కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి లో విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘనపైనా చర్యలు తీసుకోవాలని పోలీసుల కు స్పష్టం చేసింది. నాంపల్లి కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫిలింనగర్ పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీపై 448, 452, 458, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్ లో ఎ1గా దగ్గుబాటి సురేశ్, ఎ2గా వెంకటేశ్, ఎ3గా దగ్గుబాటి రానా, ఎ4గా దగ్గుబాటి అభిరామ్‌లను పేర్కొన్నారు.