గీసుకొండ: భూ వివాదంలో ఐదుగురి కేసు నమోదైన సంఘటన మండలంలో చర్చానీయాంశంగా మారింది. మండలంలోని ధస్రుతండా గ్రామ పరిధిలోని సర్వే నంబరు 773/1, 774లోని 1.18 ఎకరాల భూమిని ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామానికి చెందిన సవాయి శ్రీనివాస్ కొనుగోలుచేసి భూమిని దున్నుతున్నాడు. ఇదే క్రమంలో ధస్రుతండా గ్రామానికి చెందిన ఆంగోతు శ్రావణ్ అతని కుటుంబ సభ్యులు స్వామి, లక్ష్మి, రజిత, రమ భూ యజమాని శ్రీనివాస్‌ను భూమి ఎందుకు దున్నుతున్నామని బూతులు తిడుతూ చెప్పులతో కొట్టారు. కాగా శ్రావణ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్‌ను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులని నానా బూతులు తిడుతూ కొట్టినట్లు తెలిపారు. దీంతో శ్రీనివాస్ శ్రావణ్ కుటుంబ సభ్యులపై పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం వీరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో శ్రావణ్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో, భూ వివాదానికి బిఆర్‌ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని, శ్రీనివాస్ బిఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదని, అనవసరంగా ప్రతిపక్షాల ప్రోద్బలంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు బిఆర్‌ఎస్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై అసత్య ప్రచారం చేస్తున్నారని గీసుకొండ మండల బిఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు వీరగోని రాజ్‌కుమార్, చల్లా వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ధస్రుతండా గ్రామపార్టీ అధ్యక్షుడు మోతీలాల్ ఒక ప్రకటనలో ఖండించారు