హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగాను తెలంగాణ పోలీసులు తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ నాయకుడు కె.టి. రామారావుపై కేసు నమోదు చేశారు.
రేవంత్ రెడ్డి బిల్డర్లు, బిజినెస్ మెన్ ల నుంచి రూ. 2500 కోట్లు వసూలు చేశారని ఆరోపించినందుకు హైదరాబాద్ పోలీసులు కెటిఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లోక్ సభ 2024 ఎన్నికలయ్యాక రేవంత్ రెడ్డి బిజెపిలో చేరుతారని కూడా కెటిఆర్ ఆరోపణ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కెటిఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ సభ్యులు నిందిస్తున్నారు. కెటిఆర్ మార్చి 27న తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పై విధంగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వైఖరి కాంగ్రెస్ నాయకుడి వైఖరిలా కాకుండా బిజెపి నాయకుడి వైఖరిలా ఉందని కూడా కెటిఆర్ వ్యాఖ్యానించారు.
పోలీసులు కెటిఆర్ పైన 505(కావాలని ఒకరిని అవమానించడం), 505(2) (ఇరు పక్షాల మధ్య కావాలని విద్వేషాన్ని పెంచడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హుజురాబాద్, గజ్వేల్ 2023 అసెంబ్లీ ఎన్నకల్లో ఈటెల రాజేందర్ తిరస్కారానికి గురయ్యాక ఇప్పుడాయన మల్కాజిగిరి నుంచి పోటీచేస్తున్నారని, ఓట్లడగడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలేమిటో కూడా రాజేందర్ వివరించాలని కెటిఆర్ వ్యాఖ్యానించారు.