Thursday, January 23, 2025

రాజ్ తరుణ్, లావణ్య కేసులో మరో బిగ్ ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్ తరుణ్, లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం నార్సింగ్ పోలీసులను పంప్రదించిన లావణ్య గత పది సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని ఆరోపిస్తూ పూర్తి ఆధారాలను పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు బుధవారం రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. తాజాగా గురువారం మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే ఎ1గా రాజ్ తరుణ్, ఎ2గా మాల్వీ మల్హోత్రా, ఎ3గా మయాంక్ మల్హోత్రాను పోలీసులు చేర్చారు. బుధవారం పోలీసులకు లావణ్య ఇచ్చిన ఆధారాల ప్రకారం. 2008 సంవత్సరం నుంచి లావణ్య రాజ్ తరుణ్ కు పరిచయం. 2010 లో ఆమెకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు.

అలాగే 2014లో తనను పెళ్లి చేసుకున్నట్లు లావణ్య చెబుతోంది. ఆ సమయంలో తమ కుటుంబం రాజ్ తరుణ్‌కు రూ. 70 లక్షలు ఇచ్చామని, 2016 లో తాను గర్భవతిని అయ్యానని, రెండో నెలలో తనకు సర్జరీ చేయించి, హస్పిటల్స్ బిల్లులు కూడా రాజ్ తరుణే కట్టాడని తన ఫిర్యాదులో ఆదారాలతో వెల్లడించింది. అలాగే కావాలనే తనను డ్రగ్స్ కేసులో మాల్వీ, రాజ్ తరుణ్ ఇరికించారని, తనను మోసం చేసిన అతనిపై చర్యలు తీసుకోవాలని, మాల్వీ, ఆమె సోదరుడు తనని చంపుతామని బెదిరించారని, ముగ్గురిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని లావణ్య ఫిర్యాదులో వెల్లడించింది.

ఒక మగాడు వంచించి వదిలేస్తే తిట్టకుండా ఆమె ఏం చేస్తుంది?:న్యాయవాది దిలీప్ సుంకర
లావణ్యపై సినీ నటుడు రాజ్ తరుణ్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆమె అడ్వొకేట్ దిలీప్ సుంకర అన్నారు. లావణ్య డ్రగ్స్ తీసుకున్నదని, వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడం సరికాదన్నారు. రాజ్ తరుణ్‌కు సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన కూడా ఆధారాలు తీసుకు రావాలన్నారు. అసలేం జరిగిందో మేమూ చెబుతామన్నారు. లావణ్య ఎన్నారై గ్రూప్ తానా ద్వారా తనను సంప్రదించినట్లు చెప్పారు. తాను రాజ్ తరుణ్ భార్యనని, ఆయనతో తనకు సమస్యలు ఉన్నాయని ఆమె చెప్పినప్పుడు అందరిలా తాను కూడా మొదట నమ్మలేదన్నారు.

కానీ తనకు 122 ఆధారాలు పెట్టినట్లు చెప్పారు. కాల్ రికార్డింగ్స్, ఫొటోలు, మెడికల్ బిల్స్ పెట్టిన తర్వాత నమ్మినట్లు చెప్పారు. దీంతో మరుసటి రోజు తన సోదరుడు, తల్లిదండ్రులతో ఆమె తన వద్దకు వచ్చినట్లు చెప్పారు. లావణ్య తొలుత నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రాజ్ తరుణ్‌పై కేసు పెట్టలేదని వెల్లడించారు. లావణ్య వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించాక కేవలం మాల్వీ మల్హోత్రాపై మాత్రమే ఫిర్యాదు చేసినట్లుగా ఉందన్నారు. పోలీసులు తీగ లాగితే మాత్రమే రాజ్ తరుణ్ డొంక కలిదిందని, కానీ లావణ్య అతనిపై ఫిర్యాదు చేయలేదన్నారు.

లావణ్య మాల్వీ మల్హోత్రా పేరు ఎత్తితేనే రాజ్ తరుణ్ తిట్టాడన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని, 700 ఆధారాలను పోలీసులకు ఇచ్చినట్లు చెప్పారు. లావణ్యపై అన్యాయంగా 4 గ్రాముల ఎండిఎంఎ దొరికిందంటూ డ్రగ్ కేసు పెట్టారన్నారు. 2017 తర్వాత కూడా లావణ్యతో రాజ్ తరుణ్ కలిసి ఉన్నట్లుగా ఆధారాలు వున్నాయని చెప్పారు. రాజ్ తరుణ్ లావణ్యకు డబ్బులు ఇచ్చాడా? వారానికి రూ.10 వేలు కుక్కల పెడెగ్రీకి ఇచ్చాడా? చెప్పాలని నిలదీశారు. తల్లిదండ్రులను కాదని, లావణ్యను రాజ్ తరుణ్ తన ఇంట్లో పెట్టుకున్నాడని ఆయన సంరక్షణలో ఆమె డ్రగ్స్‌కు ఎలా బానిస అయ్యారో చెప్పాలన్నారు.

లావణ్య డ్రగ్స్‌కు బానిస అయినప్పుడు ఏ వీడియోలు తీశాడో చెప్పాలన్నారు. నీ ఇంట్లోనే ఆమె డ్రగ్స్ తీసుకుంటుంటే రిహాబిలిటేషన్ కేంద్రానికి ఎందుకు తీసుకువెళ్లలేదో చెప్పాలన్నారు. డ్రగ్స్ తీసుకున్నది నిజమే అయితే కనీసం తల్లిదండ్రులకైనా చెప్పాలి కదా అన్నారు. లావణ్యపై బట్టకాల్చి మీద వేస్తున్నారని మండిపడ్డారు. మాల్వీ మల్హోత్రా టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి మస్తాన్ సాయి పేరును తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. మస్తాన్ సాయితో వివాహేతర సంబంధం ఉంటే ఆధారాలు తీసుకు రావాలని సూచించారు. దొంగతనంగా బిట్లు కట్ చేసి రికార్డింగ్‌లు ఎందుకు? అని నిలదీశారు. లావణ్యను రెచ్చగొట్టి ఆమె తలకు తీవ్రంగా దెబ్బ తగిలిన తర్వాత బూతులు కాకుంటే నీతులు మాట్లాడుతారా? అని నిలదీశారు. ఒక మగాడు వంచించి వదిలేస్తే తిట్టకుండా ఆమె ఏం చేస్తుందన్నారు.

’ఏం జరిగిందో మేం కూడా చెబుతాం రాజ్ తరుణ్! నీ దగ్గర ఉన్న ఆధారాలతో నువ్వు చెప్పు, మా వద్ద ఉన్న ఆధారాలతో మేం చెబుతాం’ అన్నారు. లావణ్యను రాజ్ తరుణ్ పదకొండేళ్లు వాడుకున్నాడని, ఆమెను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు కోర్టు ద్వారా న్యాయం జరగాలన్నారు. లావణ్యకు ఎలాంటి డబ్బులు అవసరం లేదన్నారు. ఆమె తన భార్య, ఆవేశంలో నింద వేశా, ఇప్పుడు చూసుకుంటానని రాజ్ తరుణ్ అంగీకరించాలన్నారు. లావణ్యను ఉపయోగించుకొని వదిలేయవచ్చునని ఇండస్ట్రీ వారు చెబుతున్నారా? ఇదేనా వారు చెప్పేదన్నారు. లావణ్య వద్ద ఉన్న ధర్మమే ఆమెను గెలిపిస్తుందని, తాము కేవలం మాట సాయం మాత్రమే చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News