తిరువనంతపురం: తనపై 2016లో లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక నటి ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని మలయాళ నటుడు సిద్దిఖ్‌పై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. మ్యూజియం పోలీసు స్టేషన్‌లో నటుడు సిద్దిఖ్‌పై ఐపిసిలోని సెక్షన్ 376, 506 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి బుధవారం తెలిపారు. ఈ ఘటన 2016లో జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఐపిసి కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు బయటపడిన దరిమిలా వివిధ దర్శకులు, నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మలయాళ సినీ ప్రముఖుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకావడం ఇది రెండవసారి.
కాగా..2009లో జరిగిన ఘటనపై ఒక బెంగాలీ నటి చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని దర్శకుడు రంజిత్‌పై పోలీసులు ఐపిసిలోని సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. పాలేరి మాణిక్యం అనే చిత్రంలో నటించేందుకు తనను ఆహ్వానించి లైంగిక వాంఛతో తనను అసభ్యకరంగా తాకాడని దర్శకుడు రంజిత్‌పై ఆ బెంగాలీ నటి ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల దరిమిలా కేరళ బాలచిత్ర అకాడమీ చైర్మన్ పదవికి రంజిత్ రాజీనామా చేశారు. సిద్దిఖ్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను పురస్కరించుకుని అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్(అమ్మ)ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.
2017లో మలయాళ నటిపై దాడి జరిగిన తర్వాత కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని నియమించింది. జస్టిస్ హేమ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికతో మలయాళ చిత్ర సీమలో మహిళా నటులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులను వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. పలువురు దర్శకులు, నటులపై లైంగిక దాడి, దోపిడీ, వేధింపులకు సంబంధించిన ఆరోపణలు రావడంతో వీటిని దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం ఆగస్టు 25న ఏడుగురు సభ్యులతో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మహిళా నటుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.