Monday, January 20, 2025

కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాయదుర్గం పోలీసులు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తన విధులకు కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించడంతో పాటు తనని బెదిరించారని రాయదుర్గం పోలీసులకు సైబరాబాద్ అదనపు డిసిపి రవిచందన్  ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై బిఎన్‌ఎస్ సెక్షన్ల ప్రకారం 132, 351(3) కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ , కౌశిక్ రెడ్డిలు  సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ వెళ్లడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.  కౌశిక్ రెడ్డి నివాసం ఉండే గేటెడ్ కమ్యూనిటీ గేట్లను బద్దలు కొట్టిన అనుచరులు లోపలికి వెళ్లి కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలతో దాడికి పాల్పడ్డారు. ఇరువురు నాయకుల అనుచరుల మధ్య తోపులాట, కుర్చీలతో దాడులు చేసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంట్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. పెద్ద ఎత్తున నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అరెకపూడి గాంధీపై ఫిర్యాదు చేసేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, కౌశిక్‌రెడ్డి. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి తోపులాట జరగడంతో బిఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్న క్రమంలో కౌశిక్ రెడ్డి అదనపు డిసిపి రవిచందన్‌తో వాగ్వాదానికి దిగారు. డిసిపిని కౌశిక్ రెడ్డి తోసేయడంతో ఆయన రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రతిపక్షాలకు దక్కాల్సిన పిఏసి చైర్మన్ పదవిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీకి ఎంపిక చేయటం పట్ల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో గాంధీ తాను బీఆర్‌ఎస్ సభ్యుడినే అని, ప్రతిపక్ష పార్టీకే పదవీ ఇచ్చారని పేర్కొనడం తో వివాదం మొదలైంది. బీఆర్‌ఎస్ సభ్యులు అయితే గాంధీ ఇంటి మీద గురువారం నాడు గులాబీ జెండా ఎగురవేసి,కండువా కప్పుతానని, లేనట్లయితే చీర,గాజులు పంపుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు…కొండాపూర్ కొల్లా లగ్జరీయాలో నివాసం ఉండే కౌశిక్ రెడ్డి బయటకు రాకుండా గచ్చిబౌలి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News