అమరావతి: రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పేర్ని నానిని ఎ6 చేరుస్తూ బందరు తాలూకా పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉండడంతో పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు పేర్ని నాని పేరును కూడా నిందితుల జాబితాలో పోలీసులు చేర్చారు. మిల్లర్ నుంచి లారీ డ్రైవర్ కు, లారీ డ్రైవర్ నుంచి నిందితులకు పేర్ని నాని నగదు లావాదేవీలు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.
నానికి సంబంధించిన ఫోన్ పే, ఆన్ లైన్ బ్యాంకు లావాదేవీలను సేకరించడంతో పాటు పేర్ని ఆధ్వర్యంలో నగదు లావాదేవీలు జరిగినట్టు పొలీసులు గుర్తించారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఎ1గా పేర్ని నాని భార్య జయసుధను చేర్చారు. బియ్య మాయం కేసులో ఎ2 నుంచి ఎ5 వరకు నిందితుల అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజులు రిమాండ్ విధించింది. నిందితులను మచిలీపట్నంలోని సబ్ జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న గోదాము మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లర్ బొర్ర అంజనేయులు, లారీ డ్రైవర్ మంగారావు సోమవారం రాత్రి 11 గంటలకు న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. ఇప్పటికే ఈ కేసులో ఎ1గా ఉన్న పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.