Friday, November 22, 2024

ఎడిటర్లపై కేసులు

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో నిజ నిర్ధారణకు వెళ్ళిన ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై ముఖ్యమంత్రి బీరేన్ సింగే స్వయంగా పోలీసు కేసులు పెట్టించాడు. అయినా అతడిని కేంద్రం ఇంకా కాపాడుతూనే వుంది. అక్కడ హింసాకాండ అదే పనిగా కొనసాగుతోంది. మెజారిటీ మెయితీల ఆగడాలను ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. వారు ఇప్పుడు సైన్యంతోనే ఘర్షణకు దిగారు. బిష్ణుపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సైనిక బ్యారికేడ్‌పై బుధవారం నాడు 10,000 మంది మెయితీ నిరసనకారులు కర్ఫూను కూడా ఉల్లంఘించి చేసిన దాడి వారి దాష్టీకాన్ని చాటుతున్నది. ఈ మూకలు సైన్యంపై రాళ్ళు విసిరారు, వారిలోని కొందరు సాయుధులు భద్రతా దళాలపై ఆటోమేటిక్ మెషిన్ గన్స్‌తో కాల్పులు జరిపారు. భద్రతాదళాలు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాటలో కొంత మంది మహిళలు సహా పలువురు గాయపడ్డారు. సైన్యంపై జరిపిన హింసాత్మక దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మొత్తం మీద 40 మంది క్షతగాత్రులయినట్టు వార్తలు చెబుతున్నాయి. మణిపూర్ సమగ్రతపై ఏర్పాటైన సమన్వయ కమిటీ పేరిట మెయితీల బృందం ఒకటి ఇచ్చిన పిలుపు మేరకు సైన్యంపై దాడి జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వమే తమకు అండగా వున్నదన్న ధీమాతో మెయితీలు మైనారిటీ గిరిజన కుకీ జో తెగపై దాడులకు తెగిస్తున్నారని ఇంతకు ముందే రుజువైంది. మే నెల మొదటి వారంలో ఇద్దరు కుకీ మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించిన మెయితీల దుర్మార్గానికి పోలీసుల మద్దతు కూడా లభించిన సంగతి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా సాగుతున్న ఆ హింసాకాండలో, జాతుల ఘర్షణలో అక్కడి మీడియా వహిస్తున్న పాత్ర మీద అధ్యయనం చేయడానికి ఎడిటర్స్ గిల్డ్ తరపున వెళ్ళిన ముగ్గురు ప్రతినిధులపై మణిపూర్ ప్రభుత్వం తన పోలీసుల చేత కేసు నమోదు చేయించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మీడియా స్వేచ్ఛపై ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపదలచిందని ఈ ఉదంతం చాటింది. సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకొని ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకోవద్దని, ఎడిటర్స్ గిల్డ్ బృందాన్ని అరెస్టు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని ఆదేశించడంతో బీరేన్ సింగ్ ప్రభుత్వం ఆటలు చెల్లలేదు. సుప్రీంకోర్టు 2015లో కొట్టివేసిన ఐటి (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చట్టం 66ఎ సెక్షన్ కింద కూడా మణిపూర్ పోలీసులు ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై కేసు నమోదు చేయడం గమనించవలసిన విషయం.

ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్వయంగా ఆదేశించి పోలీసుల చేత ఈ కేసు పెట్టించారని తెలుస్తున్నది. ఎడిటర్స్ గిల్డ్ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైనదని, జాతి వ్యతిరేకులతో కూడిందని ముఖ్యమంత్రి దాడి చేయడం గమనించవలసిన విషయం. 9,10 తేదీల్లో జరుగనున్న జి 20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా దేశంలో ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ వర్ధిల్లుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొంటున్న నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి తమ ప్రతినిధులపై ఈ విధంగా దాడి చేయడం ఆందోళనకరమైనదని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. దాని అధ్యయన బృందం నివేదిక ఈ నెల 2వ తేదీన విడుదలైంది. ఈ బృందం మణిపూర్‌లోని వివిధ పత్రికల విలేకరులను, అఖిల మణిపూర్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రతినిధులను, పౌర సమాజ కార్యకర్తలను, మేధావులను, హింసకు గురి అయిన మహిళలను, గిరిజన ప్రతినిధులను, భద్రతా దళాలకు చెందిన వారిని కలుసుకొని అభిప్రాయాలను సేకరించింది. రాష్ట్ర పోలీసులు ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై నమోదు చేసిన ప్రాథమిక అభియోగ పత్రాలను (ఎఫ్‌ఐఆర్‌లు) తక్షణమే ఉపసంహరించుకోవాలని పౌర స్వేచ్ఛల ప్రజా సంఘం (పియుసిఎల్) డిమాండ్ చేసింది.

నిజ శోధనలో తమ దృష్టికి వచ్చిన వాస్తవాలను బయటకు చెప్పకుండా ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులను, ఇతర విలేకరులను భయపెట్టడానికే మణిపూర్ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టిందని పియుసిఎల్ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం పక్షపాతంతో కూడిన ప్రకటనలతో కుకీలపై మెజారిటీ మెయితీలను ఉసిగొల్పినట్టు ఈ క్రమంలో తప్పుడు వార్తలను కూడా ఉపయోగించినట్టు ఎడిటర్స్ గిల్డ్ నివేదిక పేర్కొన్నట్టు తెలుస్తున్నది. అలాగే సమాచారం ఒక చోటి నుంచి ఇంకొక చోటికి చేరడానికి వీల్లేకుండా చేయడం వల్ల జర్నలిస్టులు పరస్పరమూ, తమ ఎడిటర్లతోనూ స్వేచ్ఛగా మాట్లాడుకొనే అవకాశం మూసుకుపోయిందని కూడా ఆ నివేదిక నివేదించింది. ఇంటర్‌నెట్‌పై నిషేధం వదంతుల వ్యాప్తికే దోహదపడిందని, బాధితులు తమ గోడు వినిపించుకోడానికి వీల్లేకుండా పోయిందని ఆ నివేదికలో పేర్కొన్నట్టు పియుసిఎల్ తెలియజేసింది. ఎడిటర్స్ గిల్డ్ వంటి బాధ్యత గల సంస్థ పంపించిన ప్రతినిధి వర్గం మీద ప్రభుత్వం దాడి చేయడం మీడియా స్వేచ్ఛ మీద దాడి తప్ప మరొకటి కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. మణిపూర్‌లోని బిజెపి ప్రభుత్వం తనంత తానుగా ఇందుకు సాహసించడానికి అవకాశాలు తక్కువ. కేంద్రంలోని బిజెపి పాలకుల మద్దతుతోనే ఇది జరిగిందని అనుకోడానికి ఆస్కారం కలుగుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News