Monday, December 23, 2024

కొలీజియంకు గండం!

- Advertisement -
- Advertisement -

 

ఉన్నత న్యాయ స్థానాలకు న్యాయమూర్తుల నియామకం మళ్ళీ వివాదాస్పదమయింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు గత కొంత కాలంగా దీనిపై తన మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో గల కొలీజియం విధానాన్ని ఆయన విమర్శిస్తున్నారు. న్యాయమూర్తులపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇటీవలనే వరుసగా రెండు సార్లు విరుచుకుపడ్డారు. జడ్జీలు జడ్జిమెంట్ల మీద దృష్టి పెట్టడానికి బదులు తమ ఉద్యోగ కాలంలో సగ కాలం ఎవరు తదుపరి న్యాయమూర్తి అవుతారోననే చర్చలోనే తలమునకలవుతారని గత నెలలో అహ్మదాబాద్‌లో సబర్మతి సంవాద్ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించారు. మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగే 40-50 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుత్తాధిపత్యం చలాయిస్తున్నారని కూడా అక్కసు వెళ్ళగక్కారు.

న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించే పద్ధతి ప్రపంచంలో వేరెక్కడా లేదన్నారు. ఈ నెల 5న ముంబైలో న్యాయ వ్యవస్థను సంస్కరించడం అనే అంశంపై ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. కొలీజియం విధానమే మంచిది కాదన్నారు. న్యాయమూర్తులుగా అర్హులైన వారి నియామకానికి బదులు కొలీజియంలోని వారికి పరిచయమున్నవారే నియమితులవుతున్నారన్నారు. ఆయన విమర్శలు చాలా మంది న్యాయమూర్తులను బాధపెట్టాయి. న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం చేతిలో ఉండాలన్నది మంత్రి రిజుజు కోరిక, తమకు విధేయులుగా ఉండేవారినే ఉన్నత న్యాయస్థానాల న్యాయ పీఠాలపై ఉంచాలని ప్రధాని మోడీ ప్రభుత్వం ఆశిస్తున్నది. ఇది ఎంత వరకు దారి తీస్తుందో ఊహించవచ్చు.

అమెరికా పూర్వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన హయాంలో అక్కడి సుప్రీంకోర్టు న్యాయాధీశులలో మితవాదుల ఆధిక్యతను నెలకొల్పారు. 2020 సెప్టెంబర్‌లో కన్సర్వేటివ్ మహిళా జడ్జి అమీ కోనీ బ్యారెట్‌ను సుప్రీంకోర్టుకు నియమించడంతో రిపబ్లికన్ల న్యాయమూర్తుల సంఖ్య 6కు చేరి డెమొక్రాట్లు నియమించినవారు ముగ్గురే అయిపోయారు. దానితో ఊహించినట్టే సుప్రీంకోర్టు అబార్షన్‌ను నిషేధించింది. ఆధునిక అమెరికా చరిత్రలో అత్యంత అనాగరక విషాదమయమైన అధ్యాయం తెరుచుకొన్నది. న్యాయమూర్తుల నియామకం కోసం జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి)ను నెలకొల్పుతూ 2014 ఆగస్టులో నరేంద్ర మోడీ ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ఇందులో భారత ప్రధాన న్యాయమూర్తిని ఎక్స్ అఫీషియో చైర్మన్ చేస్తూ మరి ఇద్దరు సీనియర్ జడ్జీలకు అవకాశం కల్పిస్తూనే కేంద్ర న్యాయ శాఖ మంత్రికి, ఇద్దరు ప్రముఖులకు చోటు కల్పించాలని నిర్ణయించారు.

అంత వరకు గల కొలీజియం వ్యవస్థకు బదులుగా ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు ఎన్‌జెఎసిలో చేరడానికి నిరాకరించారు. ఆ వ్యవస్థను సవాలు చేస్తూ పిటీషన్‌లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్‌కి నివేదించింది. జస్టిస్ జెఎస్ కేహార్ అధ్యక్షతన గల ఆ ధర్మాసనం 4-1 మెజారిటీతో ఎన్‌జెఎసిని కొట్టి వేసింది. అది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలోని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాత్రమే భిన్న తీర్పుతో ఎన్‌జెఎసిని సమర్థించారు. కొలీజియం సిఫారసు చేసిన వారిని ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులుగా నియమించకుండా కేంద్రం కాలయాపన చేయడంతో అన్ని స్థాయిల వడపోతల్లో నెగ్గిన ఆ అభ్యర్థులు నియామకానికి తమ అనుమతిని ఉపసంహరించుకొంటున్నారు. ఉన్నత న్యాయమూర్తులుగా కొలీజియం సూచించిన వారిని నియమించకుండా కేంద్రం చేస్తున్న నిరవధిక జాప్యంపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన జస్టిస్‌లు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ శ్రీనివాస్ ఓకాల ధర్మాసనం మొన్న శుక్రవారం నాడు కేంద్రానికి నోటీసులిచ్చింది.

విషయాన్ని తీవ్రంగా తీసుకొన్నది. కొలీజియం తిరిగి పంపిన 11 మంది పేర్లను ఆమోదించి నియామకం చేయకపోడాన్ని సవాలు చేస్తూ బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌ను కూడా ఈ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై ఇటీవలే పదవీ విరమణ చేసిన మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. అయిదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం కొలీజియం వ్యవస్థను ధ్రువపరిచిందని అంతకు మించిన వ్యవస్థ లేదని అన్నారు. కేంద్రం గనుక మరో రాజ్యాంగ సవరణ ద్వారా కొలీజియంను రద్దు చేసి ఎన్‌జెఎసిని పునరుద్ధరించినా అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమవుతుందని అన్నారు. దేశ ఉన్నత న్యాయ వ్యవస్థను గరిష్ఠ స్థాయిలో కాషాయీకరించడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం చేస్తున్న విసుగు విరామం లేని యత్నాలను అడ్డుకోడంలో సుప్రీంకోర్టు మళ్ళీ సఫలం కావాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News